అమరావతి: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని….ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా…ప్రభుత్వం తగు రీతిలో స్పందించ లేదన్నారు. ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని…సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ ముంచుకురావటం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలన్నారు. తుపాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
పార్టీ కార్యకర్తలు బాధిత వర్గాలకు అండగా ఉండాలి…
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తుఫాన్ బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. పలు జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది, బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు.
మల్లన్న దర్శనం వాయిదా…
తుఫాన్ నేపధ్యంలో మంగళవారం శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని చంద్రబాబు నాయుడు వాయిదా వేసుకున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో శ్రీశైలం పర్యటనను చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత శ్రీశైలం మల్లన్న దర్శించుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.