- దళితులపై దమనకాండ పాపం భారీ విగ్రహం పెడితే పోతుందా?
- ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్నపుడే అంబేద్కర్‌కి భారతరత్న
- టీడీపీ హయాంలోనే దళితులకు న్యాయం
- పచ్చటి కోనసీమలో చిచ్చుపెట్టారు, హింసకు కేంద్రంగా మార్చారు
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం
- వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది
- కుదేలైన ఆక్వారంగాన్ని ఆదుకుంటాం
- మండపేట రా… కదలిరా సభలో చంద్రనిప్పులు
మండపేట: ప్రశాంతతకు నిలయమైన కోనసీమను వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలు, అల్లర్లతో హింసకు కేంద్రంగా మార్చారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో శనివారం సాయంత్రం నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ……అల్లర్లు జరిగి ఇక్కడ వారం రోజులు ఇంటర్నెట్ కట్ చేసారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి.. రౌడీ యిజంతో కోనసీమను మరో పులివెందులగా మారుద్దామనుకుంటున్నారా.. అది జరగనివ్వనని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు దళితులపై దమనకాండ సాగించి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా.. దళితద్రోహి జగన్‌కు అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత కూడా లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ఐదేళ్ల వైైసీపీ పాలనలో మహిళలు, రైతులు, రైతు కూలీలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఏ కులం, మతం, ప్రాంతం వారు ఆనందంగా లేరు. దీనికి కారణం వైసీపీ విధ్వంస పాలనే. రా..కదలిరా అనేది నా కోసం కాదు. దగా పడ్డ ఆంధ్రప్రదేశ్ కోసం. ఈ పాలనలో ఆక్వా రైతు కుదేలయ్యాడు. ధాన్యం రైతు దగా పడ్డాడు. కానీ గంజాయి పండిరచిన రైతులు బాగున్నారు. మండపేటలో సైతం గంజాయి అమ్ముతున్నారు. గంజాయి బారిన పడి యువత నిర్వీర్యమైపోతోంది. సీఎం ఒక్క రోజైనా గంజాయిపై సమీక్ష చేశారా? రాష్ట్రంలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ధాన్యం కొనే వారు లేరు. ఈ క్రాప్ అంటూ మోసం చేశారు. అకాల వర్షాలు, తుఫాన్‌లు, కరువుతో రైతులు అతలాకుతలం అవుతున్నా జగన్ రెడ్డి పట్టించుకోలేదు. పంటకాలువల్లో పూడిక తీయటం చేతకాక చేతికొచ్చిన పంటలను ముంచారు. టీడీపీ హయాంలో రూ.64 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశాం. పోలవరం 72 శాతం పూర్తి చేశాం. టీడీపీ హయాంలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆక్వా రంగం నేడు కుదేలైంది. మందులు, మేత అన్ని ధరలు పెరిగాయి. ఆక్వారంగాన్ని ఆదుకుంటాం. రూ.1.50లకే యూనిట్ కరెంట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
జగన్ రెడ్డికి సంపద సృష్టి తెలియదు
అప్పటివరకు రూ.200 ఉన్న ఫించన్ ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 2 వేలు చేశాం. మూడు వేల పింఛన్ ఇస్తానన్న జగన్ రెడ్డి మాట తప్పి కేవలం రూ.250 పెంచి మోసం చేశారు. అన్న క్యాంటీన్, క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి కానుకలు, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ విదేశీ విద్య వంటి 100 పథóకాలు రద్దు చేశారు. సంపద సృష్టించి ఆ ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమంపై ఖర్చు పెడతాం. కానీ జగన్ రెడ్డికి సంపద సృష్టించటం చేతకాదు. పేదలను పేదరికం నుంచి పైకి తీసుకొస్తాం. వైసీపీ పాలనలో నష్టపోని వర్గం లేదు. బీసీలకు ఏడాదికి రూ. 15 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో రూ. 75 వేలు కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేశారా? బీసీ సబ్ ప్లాన్ ఏమైంది? బీసీలు ఎప్పుడూ టీడీపీ వెంటే ఉంటారు. బీసీల రుణం తీర్చుకుంటాం. బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొస్తాం. మత్స్యకారులకు సబ్సిడీ లేదు. బీసీలకు ఆదరణ పనిముట్లు రద్దు చేశారు. ఉచిత ఇసుక రద్దు చేసి అక్రమ రవాణాతో రూ. 40 వేల కోట్లు దండుకున్నారు. కొత్తగా ఇసుక రవాణా చార్జీలు పెంచారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక ఎలా తవ్వుతారు? రాష్ట్రంలోని 5 కోట్ల జనాభా కలిసి ఇసుక దొంగల సంగతి చూడాలి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. వీరిలో బీసీలే ఎక్కువ. స్ధానిక సంస్ధల్లో బీసీలకు రిజర్వేషన్లు కోత కోసి పదవులు దూరం చేశారు. కాపు కార్పొరేషన్ కి రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కనీసం రూ. 10 ఖర్చు చేశాడా? కాపు మంత్రుల చేత నన్ను, పవన్‌ను బూతులు తిట్టిస్తున్నారు. సామాజిక న్యాయం అంటున్నాడు…90 మంది ఎమ్మెల్యేలను మార్చుతాడంటా. తన తప్పుల్ని ఎమ్మెల్యేలపై నెడితే పోతుందా? మండపేటలో రెడ్లు ఎక్కువ. ఎంతమంది రెడ్లకు న్యాయం జరిగింది. కాంట్రాక్టర్లకు రూ. 90 వేల కోట్లు బిల్లులు నిలిపేయటంతో 43 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైస్ మిల్లర్లు, పౌల్ట్రీ ఫాం రైతులు, చిరువడ్డీ వ్యాపారులు ఇలా అందరూ నష్టపోయారు. జగన్ పాలనలో అందరూ బాధితులే. అందరం కలిసి వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో వేయాలి. వైసీపీలో 68 మంది ఇన్‌చార్జ్ లను మార్చారు. వారిలో 46 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. మీ ఊళ్లో చెత్త పక్క ఊర్లో వేస్తే బంగారమవుతుందా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
టీడీపీ హయాంలోనే దళితులకు న్యాయం
బాబాయిని ఎవరు చంపారో సమాధానం చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? దళితులకు ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీనే. ఉమ్మడి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి 12 జీవోలు తెచ్చి దళితులకు న్యాయం చేశాం. అంటరానితనం, రెండు గ్లాసుల విధానం రద్దు చేసింది టీడీపీనే. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నపుడే అంబేద్కర్ కి భారతరత్న వచ్చింది. జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా, కాకి మాధవరావుని సీఎస్ గా చేశాం. దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు నేను కృషి చేస్తే జగన్ రెడ్డికి వారికి ద్రోహం చేశారు. 29 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. సబ్ ప్లాన్ నిర్వీర్యం చేశారు. 5 ఏళ్లలో ఒక్కరికీ కూడా ఎస్సీ కార్పోరేషన్ రుణాలు ఇవ్వలేదు. భూమి కొనుగోలు పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ వంటి అనేక పథకాలు రద్దు చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి. వైసీపీ పాలనలో 6 వేలకు పైగా దళితులపై దాడులు జరిగాయి, 188 మంది హత్యకు గురయ్యారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ని పిచ్చోడిని చేసి చంపారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగిస్తారా? నెల్లూరులో నారాయణ, కావలిలో కరుణాకర్ ఇలా 188 మంది దళితులు హత్యకు గురయ్యారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్ కి శిరో ముండనం చేశారు. అమరావతిలో ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఇన్ని ఘోరాలు చేసి అంబేద్కర్ విగ్రహం పెడితే ఆ పాపం పోతుందా? అంబేద్కర్ విగ్రహం తాకే అర్హత కూడా జగన్ రెడ్డికి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలయింది
రాష్ట్రంలో రోడ్లు ఎక్కడైనా బాగున్నాయా? రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. వ్యవసాయ శాఖను మూసేశారు, ఆర్ అండ్ బీ అసలు లేదు. ఇరిగేషన్ అసలు పనిచేయటం లేదు. ఇంగ్లీష్ మీడియం తప్పు కాదు. కానీ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ తో రాదు. మాతృ భాషతోనే వస్తుంది. 25 ఏళ్ల క్రితమే ఐటీని ప్రమోట్ చేశా.. నేడు మన యువత పొరుగు రాష్ట్రాలు, దేశాలు వెళ్లి డబ్బులు సంపాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తూ.గో జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ, జనసేన గెలుస్తుంది. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలయిందని చంద్రబాబు అన్నారు.
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ
ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది మహిళలుంటే వారికి నెలకు రూ. 1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్దులున్నా ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. యువగళం నిధి కింద నెలకు రూ. 3 వేలు యువతకు నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. యువత సైకిలెక్కి టీడీపీ `జనసేన జెండాలు పట్టి ప్రజలను చైతన్యం చేయాలి. అన్నదాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరిస్తాం. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది ఎన్టీఆర్ కల. దాన్ని నిజం చేస్తాం. కుటుంబ వికాసం, జన్మభూమి స్పూర్తితో పేదల్ని ధనికులుగా చేస్తాం. దీనికి మీ అందరి సహకారం కావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ఆయారాం.. గయారాంలను దూరంగా ఉంచుదాం
ఆయారాం.. గయారాంలను దూరంగా ఉంచుదాం. మండపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ చాలా తెలివైనవాడు. మండపేట వైసీపీ ఇన్‌చార్జ్ ఇసుకలో రూ. 500 కోట్లు కొట్టేశారు. తాతపూడి ర్యాంపులో ఇసుక మింగేస్తున్నారు. మండపేట మున్సిపాలిటీిలో …ఇళ్ల పట్టాల పేరుతో రూ. 20 లక్షలు కూడా విలువ చేయని భూములను రూ. 50 లక్షలకు అంటగట్టి దోచుకున్నారు. రౌడీయిజం చేస్తున్నారు. కాలేరు గ్రామంలో 5 మంది దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. ఇద్దరు సర్పంచ్‌లపై కేసులు పెట్టారు. రేపు మీ గతి ఇదే. ఒక్క కేసు పెడితే వంద కేసులు పెట్టే సత్తా టీడీపీ` జనసేనకు ఉంది. ప్రశాంతతకు మారుపేరైన మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావుని మళ్లీ ఎమ్మెల్యే గా గెలిపించాలి. రామచంద్రాపురంలో చెల్లని కాసు చెల్లుబోయిన వేణు.. విజయసాయిరెడ్డి కాళ్ల మీద పడి బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టారు. ముమ్మిడివరంలో పొన్నాడ సతీష్ రూ. 15 లక్షల విలువైన భూమి రూ. 30 లక్షలకు అమ్ముకున్నారు. లేఅవుట్ వేయాలంటే ఆయనకు కమీషన్లు ఇవ్వాలి. యానాం నుంచి అక్రమ మద్యం తెచ్చి అమ్ముతున్నారు. అమలాపురంలో పినిపే విశ్యరూప్ అవినీతికి అడ్డూ అదుపులేదు. రాజోలు ఎమ్మెల్యే జనసేన నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లారు. ఆయన పెళ్లి ఒక చోట కాపురం మరో చోట. ముఖ్యమంత్రి పెద్ద తిమింగలం అయితే వీళ్లు చిన్న చిన్న తిమింగలాలు. మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే సైకో పోవాలి. కేసులకు భయపడి ఊరుకుంటారా? ఎన్ని రోజులు భయపడతారు? పవన్ ని హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి రానివ్వరా? వైసీపీలో బూతులు ఎక్కువ తిట్టిన వారికే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అంట అని చంద్రబాబు అన్నారు.
టీడీపీ అధికారంలోకి రాగానే..
అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి పెండిరగ్ లో ఉన్న బిల్లులు విడుదల చేస్తా. పెన్షన్‌ను నిలిపేసిన వారికి ఎప్పటి నుంచి నిలిపివేశారో అప్పటి నుంచి ఇచ్చే బాధ్యత నాది. ముమ్మడివరంలో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. రూ.45 కోట్ల వ్యయంతో గుత్తెనదీవి, గోగులంక మధ్య బ్రిడ్జి నిర్మిస్తాం. బాలయోగి చిరకాల వాంఛ అయిన కోనసీమ రైల్వే లైన్‌ను పూర్తి చేస్తాం. ముక్తేశ్వరం-కోటిపల్లి మధ్య, సఖినేటిపల్లి-నర్సాపురం మధ్య పెండిరగ్‌లో ఉన్న వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. కొబ్బరి దింపుడు, ఒలుపు కార్మికులకు బీమా పథకాన్ని తెస్తాం. నష్టపోయిన కల్లు గీత, మత్స్యకారులు, చేనేత కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేసి చూపిస్తాం.
కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి ప్రతి పనికి కప్పం కట్టాలంట..కానీ ఆయన్ని మాత్రం జగన్ మార్చలేదు. అనపర్తి ఎమ్మెల్యేను మార్చలేదు. హోల్ సేల్ కరప్షన్ కింగ్ ద్వారంపూడిని మార్చలేదు. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఆధారాలు ఇస్తాం.. కేసులు పెట్టే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై చార్జ్‌షీట్లు వేస్తాం. దళిత మంత్రుల్ని మార్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను నాయకులుగా ఎదగకుండా జగన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలంటే ప్రజలంతా టీడీపీ, జనసేనను గెలిపించాలి. అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మీ అందరి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.