అమరావతి: దళితనేతలు ఇంకా ఎంతకాలం మౌనముద్రలో ఉంటారని మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ విడుదలచేస్తూ… నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ని కొడితే మీ క్యాస్ట్ కాదని గమ్మునున్నారు. నెల్లూరు ఎంపీడీవో సరళపై కోటంరెడ్డి దాడిచేస్తే మహిళా ఉద్యోగి అని మౌనం వహించారు. గుడివాడ గడ్డం గ్యాంగ్ ఆర్ఐ అరవింద్ పై ఎటాక్ చేస్తే మన శాఖ వాడు కాదని పక్కకెళ్లిపోయారు. విశాఖలో సీఐని మంత్రి సీదిరి నానా దుర్భాషలాడితే ఉద్యోగ సంఘాల్లో ఖాకీలు లేరని పట్టించుకోలేదు. రాజమహేంద్రవరంలో ఏఈ సూర్యకిరణ్ ని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొడితే, మనల్ని కొట్టలేదని మౌనంగా వుంటే…ఇంటింటికీ వస్తారు..ఊరూరా తిరుగుతారు..ప్రతీ ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి బయటకు ఈడ్చుకొచ్చి మిమ్మల్నీ కొడతారు. కొడితే కొట్టించుకుంటున్నారే గానీ, ఇదేమి రౌడీయిజం అని అడగటానికి ఒక్కరికీ నోరు లేవదేం. మా ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని ఒక్క ఉద్యోగ సంఘమూ ఖండించదేం. నిజాయితీగా విధులు నిర్వర్తించే ఉద్యోగులు, అధికారులపై దాడులు చేస్తే ఉద్యోగ సంఘాలు ఊరుకుంటాయేమో కానీ, తెలుగుదేశం ఊరుకోదు. బాధిత ఉద్యోగులకి అండగా పోరాడుతుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.