పోలేపల్లి: దళితులకు చరిత్రలో ఎన్నడూలేని విధంగా ద్రోహం చేసిన జగన్‌రెడ్డిని మొత్తం దళిత జాతి ఛీకొట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం జరిగిన యువగళం`నవశకం బహిరంగసభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యువగళం-నవశకం సభ జరిగిందన్నారు. యువనేత లోకేష్ యువగళంలో 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించారన్నారు. ప్రత్యర్థులకు, రాష్ట్రంలోని అవినీతి పాలకులకుయువగళం పాదయాత్ర సింహస్వప్నంలా మారిందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన పార్టీలు సాధించబోయే అద్భుత విజయానికి ఈ సభకు హాజరైన ప్రజలే నిదర్శనం. రాష్ట్రంలోని దళితులకు.. ఇక్కడికి వచ్చిన టీడీపీ-జనసేన పార్టీల్లోని దళితులకు ఒక్కటే విజ్ఞప్తి. ఈ ముఖ్యమంత్రి అసత్యాలు.. అబద్ధాలతో గత ఎన్నికల్లో దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు. దళితులు తనకు మేనమామలని చెబుతూ ఈ ముఖ్యమంత్రి మనల్ని తన ఇనుప పాదాలతో అణచివేశాడు. అలాంటి నాయకుడిని దళితులు త్యజించాలి. మన నాయకుడు. మన అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన చంద్రబాబునాయుడికి దళితులంతా మద్దతుగా నిలవాలి. దళితులంతా జగన్ రెడ్డిని ఛీకొట్టాలని వర్ల రామయ్య పిలుపు ఇచ్చారు.