విజయవాడ (చైతన్య రథం): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు తలకు స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ పరివేట్టం చుట్టగా.. పట్టువస్త్రాలు, సుమంగళ ద్రవ్యాలను తలపై పెట్టుకుని సీఎం తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సారెచీరె సమర్పించారు. అంతకుముందు ఆలయంవద్ద సీఎంకు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డోనర్ సెల్ వివరాలను దేవదాయ శాఖ కమిషనర్, ఈవో సీఎంకు వివరించారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ దంపతులు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపించింది.
కుమార్తెతో కలిసి పవన్..
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం దర్శించుకున్నారు. కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయం వద్ద అధికారులు పవన్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. పవన్‌తోపాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు మరో మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రిపై కోలాహలం నెలకొంది.