.వరదల సమయంలో రాకుండా అంతా అయిపోయాక ఎందుకొచ్చారు?
.ప్రెస్ మీట్లు పెట్టడానికి భయపడే జగన్ రెడ్డి మీడియాతో నవ్వులేంటి?
.ముందు మీరు విచారణకు హాజరై తరువాత నీతులు చెప్పండి
అమరావతి: దొంగలుపడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్న సామెతలా, వరదలు సంభవించినప్పుడు రాకుండా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తరువాత వచ్చి ఏం లాభం? అని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు వరద ప్రాంతానికి వెళ్లి, వారికి సహాయం అందించి వచ్చాక సీఎం వెళ్లారన్నారు. ఇప్పుడు కళ్లు తెరిచారని ఎద్దేవా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలడానికే ఆయనకు మనసు ఒప్పదని చెప్పారు. సీఎం వచ్చినప్పుడు ఎలా మెలగాలో ప్రజలకు ఎలా ట్రైనింగ్ ఇచ్చారో సోషల్ మీడియాలో చూసినట్లు తెలిపారు. ఎప్పుడూ లేనిది కొత్తగా కోనసీమ జిల్లాల్లో జగన్ రెడ్డి మీడియా మిత్రులను చూసి నవ్వడం, వారితో ఆప్యాయంగా మాట్లాడటం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. మీడియాను చూస్తేనే మైండ్ బ్లాకై, ప్రెస్ మీట్ లు పెట్టడానికే భయపడి మూడు సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాని సీఎం నేడు మీడియాతో ముచ్చటించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోనసీమలో మీడియాతో మాట్లాడిన విషయాలు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.
ఘోరంగా జగన్ పాలన
జగన్ పరిపాలన ఘోరంగా ఉందని, అవినీతి జరిగితే 14400కు కాల్ చేయండని సీఎం చెప్పడం హాస్యాస్పదని అన్నారు. ఇది గిట్టని ఉద్యోగస్థులను భయపెట్టటానికేనని చెప్పారు. ఎవర్ని భయపెట్టడానికి ఈ యాప్‌లు? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి యాప్‌లు తేవాలన్నారు. ప్రజలకు ఏం కష్టమొస్తుందో, మహిళలకు ఏ బాధలున్నాయో, ఏ వేధింపులకు గురవుతున్నారో వాటి కోసం యాప్‌లు తేవాలని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ లో జరుగుతున్న అవినీతిపై, మీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఏ నెంబర్ కు కాల్ చేయాలి? అని అడిగారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియా అవినీతి అధికంగా ఉందన్నారు. ముందు మీరు మారి, ఆ తర్వాత మీ గ్యాంగ్‌ను మార్చాలని హితవుపలికారు. 151 మంది ఎమ్మెల్యేల అవినీతిపై తమ దగ్గర సాక్ష్యాలున్నాయని హెచ్చరించారు. మీరు జ్యుడీషియల్ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మద్యం రేట్లు పెంచడంవల్ల మహిళల బతుకులు అన్యాయమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు పరిష్కర వేదికగా 1100 టోల్ ఫ్రీ నెంబర్ చంద్రబాబు నాయుడు పెట్టినట్లు గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను కూడా ధిక్కరించి అక్రమమైనింగ్ జరుగుతోందని చెప్పారు. దీనిపై మీరు జ్యుడీషియల్ వేయడానికి సిద్ధమా? అని అడిగారు. వైసీపీ అక్రమాల పుట్ట అని విమర్శించారు. భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడరని చెప్పారు. అందరినీ ఎంతో కాలం మభ్యపెట్టలేర హెచ్చరించారు. అన్నాహజారే వారసుల్లా నీతులు మాట్లాడుతున్నారు, ముందు మీరు సీబీఐ విచారణకు హాజరై, కేసులు ముగించుకొని ఆ తర్వాత ఇతరులకు నీతులు చెప్పాలని పీతల సుజాత పేర్క్న్న్షొరు.