- నిరుద్యోగంపై కపట సాక్షి దొంగ లెక్కలు
- ఆర్బీఐ లెక్కలంటూ మాయ నాటకం
- వాస్తవానికి ఏడు శాతానికి పైగా పెరిగిన నిరుద్యోగిత
- కొత్త నోటిఫికేషన్లు లేవు… కొత్త పరిశ్రమలు రావు
- ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు
- స్వయం ఉపాధి పథకాలకు మంగళం
అమరావతి, చైతన్యరథం: జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గిందంటూ, అందుకు ఆర్‌బిఐ చెప్పిన లెక్కలను చూపుతూ కపట సాక్షి దొంగ లెక్కలను ప్రచురించింది.కపట సాక్షి శుక్ర వారం ప్రచురించిన కథనంలో ఎక్కడా సరైన అధారా లు ఇవ్వలేదు. ఏ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా నిరుద్యోగం తగ్గిందంటూ చెప్పిన గణంకాలను పేర్కొన లేదు. ఒక్క ఆర్‌బిఐ చెప్పిన అంకెలనే తెలిపింది. సాధా రణంగా ఆర్‌బిఐ సొంతగా నిరుద్యోగంపై నివేదికలు తయారు చేయదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నివేదికలు ఇస్తే వాటి ఆధారంగానే వివరాలు వెలువరిస్తుంది. జగన్‌రెడ్డి ప్రభుత్వం తాను తయారు చేసిన దొంగ లెక్కలనే ఆర్‌బి ఐ నోట చెప్పించి నిరుద్యోగం తగ్గిందంటూ మాయ నాటకాలు ఆడుతోంది. వాస్తవానికి ఈ నాలుగన్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వ పరంగా కొత్త నోటిఫికేషన్లు ఏమీ ఇవ్వలేదు. ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. మరోవైపు ఈ నాలుగున్న ంళ్లలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. తమ కమీ షన్ల కక్కుర్తి కోసం ఉన్న పరిశ్రమలనే తరిమి కొట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలైన స్వయం ఉపాధి పథకాలకు కూడా మంగళం పాడారు.
ఏడు శాతానికిపైగా పెరిగిన నిరుద్యోగిత…
చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్లపాలనా కాలంలో ఎన్నో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి,కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసి, స్వయం ఉపాధి పథకా లకు పెద్దఎత్తున నిధులు సమకూర్చడంతో నిరుద్యోగం తగ్గింది.2019నాటికి రాష్ట్రంలో కేవలం నాలుగుశాతం మాత్రమే నిరుద్యోగం ఉంది. అదే జగన్‌రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత 2023 మార్చి నాటికి నిరుద్యోగం 7.1 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మోనటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. అది కాస్త 2023 చివరికి 7.7శాతానికి పెరి గిందని గణంకాలు వెలువడుతున్నాయి. అంతేకాక ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఉద్యోగాలు, ఉపాధి లేక రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మందికి పైగా యువత ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రప్రభుత్వ లెక్కలే తెలుపుతున్నా యి. ఇంతపచ్చిగా గణంకాలు కనిపిస్తున్నా, ఉద్యోగాలు దొరక్క యువత చనిపోతున్నా సిగ్గు లేకుండా రోత పత్రికలో కపట రాతలు రాసుకోవడం ఒక్క జగన్‌రెడ్డికి మాత్రమే చెల్లింది.
కొత్త నోటిఫికేషన్లు లేవు…
ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగా లను భర్తీ చేస్తానని జగన్‌రెడ్డి హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లే ఇవ్వడం లేదు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాననని నమ్మ బలికి ఒక్క ఏడాది మాత్రం ప్రకటించి పోస్టులు మాత్రం భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాడు. ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తానని చెప్పి ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదు. అదే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు సార్లు గ్రూపు 2 పోస్టులను భర్తీ చేశారు. డిఎస్సీ ద్వారా 17 వేలకు పైగా ప్రభుత్వ టీచర్లను నియమించారు. పోలీస్ శాఖలోనూ నియమా కాలు చేశారు. కానీ జగన్‌రెడ్డి మాత్రం మాయ హామీ లు ఇచ్చి అధికారంలో వచ్చి నిరుద్యోగులను నిలువునా ముంచాడు. ఎన్నికల సమయం ముందు గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటూ నిరుద్యోగులను వంచించేందుకు పూనుకున్నాడు.
ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టారు…
తమ అవినీతితో, ఆత్యాశతో ప్రతి దాంట్లోనూ కమీషన్లుకు కక్కుర్తి పడుతున్న జగన్ రెడ్డి పాలన చూసి ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. పైగా వీరి వేధింపులు తట్టుకోలేక ఉన్న పరిశ్రమలు కూడా పారిపోయాయి. అమర్‌రాజా బ్యాటరీస్, కియా అనుబంధ పరిశ్రమలు, జాకీ పరిశ్రమ, ఏషియన్ పేపర్ మిల్స్, అదానీ డేటా సెంటర్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, లూలూ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మెడ్ టెక్ జోన్Ñ సింగపూర్ స్టార్టప్ సంస్థలు, హెచ్‌సిఎల్, ఐబిఎం, ఫిన్‌టెక్, హెచ్‌ఎస్‌బిసి, విశాఖ రుషికొండ ఐటి సెజ్‌లో 14 కంపెనీలు, గన్నవరం మేథా టవర్స్‌లో ఐటీ కంపెనీలు పోరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. కేవలం జగన్‌రెడ్డి తన డబ్బు పిచ్చితో కమీషన్లతోపాటు కంపెనీల్లో వాటాలు కూడా కావాలని బరితెగించడంతో భరించలేక కంపెనీలన్నీ పారిపోయాయి. రాష్ట్రానికి జగన్‌రెడ్డి తెచ్చిన ఈ కొత్త బ్రాండ్‌తో ఉన్న పరిశ్రమలే వెళ్లిపోగా కొత్త పరిశ్రమలు ఒక్కటి రాలేదు. దీంతో కొత్తగా ఉపాధి కల్పన మాట అలా ఉంచితే ఉన్న ఉపాధిని కూడా రాష్ట్ర యువత కోల్పొయింది. అదే చంద్రబాబు ప్రభుత్వ హయంలో 15 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 32 లక్షల మందికి ఉద్యోగాలు కల్పనతో ఎంవోయులు కుదుర్చుకున్నారు. వీటిలో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో గ్రౌండ్ అయ్యాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 5.13 లక్షల మందికి పరోక్షంగా పది లక్షల మందికి ఉపాధి లభించింది. మిగిలిన కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చేవే కానీ జగన్ రెడ్డి డబ్బు దాహంతో బెదిరిపోయి చేసుకున్న ఒప్పందాలను కూడా పక్కనపెట్టేశాయి.ఐటి రంగంలోనూ చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో ఏపీ మంచి ప్రగతి సాధించింది. నారా లోకేష్ ఐటి మంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు కేవలం ఐదు వేల మంది మాత్రమే. ఆ తర్వాత ఆ సంఖ్య 37 వేలకు పెరిగింది. కానీ జగన్‌రెడ్డి పాలనలో ఐటి రంగం కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఐటి, సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో రాష్ట్రంలో ఏడో స్థానానికి పడిపోయింది.
స్వయం ఉపాధి పథకాలకు మంగళం…
చంద్రబాబు ప్రభుత్వ హాయంలో సామాజిక వర్గాల వారీగా కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు నిధులను పెద్ద ఎత్తున మంజూరు చేశారు. దళితులుకు ఇన్నొవా కార్లు, బీసీలకు ఆదరణ పథకం, మహిళా గ్రూపులకు రుణాలు, కాపు, బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసి వారు స్వంతకాళ్లపై నిలబడేలా చేశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ పథకాలన్నింటినీ రద్దు చేసింది. నాలుగున్నరేళ్ల కాలం లో ఒక్క రుణం కూడా మంజూరు చేయలేదు. 51 కార్పొరేషన్లు పెట్టినప్పటికీ ఆ సామాజిక వర్గాల ప్రజ లకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. టీడీపీ ప్రభుత్వ హయంలో నెలకు ఆరు లక్షల మందికి రెండు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తే దాన్ని కూడా జగన్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి నిరుద్యోగుల కడుపు మీద కొట్టింది.
ఇలా అన్ని రకాలుగా యువతను అన్యాయం చేసి, వారిని నిరుద్యోగులుగా మార్చి, వారు అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఆత్మావలోకనం చేసుకోవడం మానేసి కపట సాక్షిలో దొంగ రాతలు రాస్తున్నారు. కానీ యువత మాత్రం ఈ కపట రాతలను నమ్మే స్థితిలో లేదు. ఇదే సమయంలో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తామని, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తామని హామీనిస్తోంది. నిరుద్యోగ యువతకు భృతిగా నెలకు రూ.3 వేలు అందిస్తామని భరోసానిస్తోంది. దీంతో రాష్ట్రంలో యువత, నిరుద్యోగులు బాబు వస్తేనే జాబు వస్తుందనే భరోసాలో ఉన్నారు.