అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు. చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ వచ్చిన సందర్భంగా మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో అనందబాబు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 53 రోజులు జైలులో ఉండటం చాలా దురదృష్టకరమన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, పక్క రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా వారి సంఫీుభావాన్ని తెలియజేశారు. నిరసనలు, ఆందోళనలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా.. ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో స్వచ్ఛందంగా ఆందోళనలు, ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం చూసాము. అన్యాయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు అనే బాధ, కసి మాలో ఉన్నాయి. ఈరోజు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని మేమేమి పొంగిపోవడం లేదు. మిగిలిన కేసుల్లో కూడా బెయిల్ తప్పకుండా వస్తుందని ఆనందబాబు ధీమా వ్యక్తం చేశారు. న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తన బినామీల ద్వారా మద్యం వ్యాపారం చేయిస్తున్నాడు. ప్రతిరోజూ సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ కి కోట్లు వెళుతున్నాయి. ఇసుక ద్వారా దాదాపు 40 వేల కోట్ల అవినీతి జరిగిందని మేము ఆధారాలతో సహా చూపించాం. 16 నెలలు జైల్లో ఉండి 12 ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డి, ఏ మరక లేకుండా ఉన్న చంద్రబాబు నాయుడుకి కూడా ఏదో ఒక మరొక అంటించి పలచన చేయాలి అనే ఆలోచనతోనే తప్పుడు కేసులు పెడుతున్నారనే విషయం ప్రజలందరికీ అర్ధమయిందన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్ పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కేసులు పెట్టి ఉంటే ప్రజలు ఏమైనా ఆలోచించేవారు ఏమో కానీ, ఇంకో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తుంటే మమ్మల్ని ప్రజల మధ్యకు వెళ్ళనీయకుండా చేయాలనో, మా శ్రేణులను నిర్వీర్యం చేయాలనో, మా కార్యకర్తల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలి అని తప్పుడు ఆలోచనలతో జగన్ తప్పుడు కేసుల పరంపరకు తెర లేపాడని ఆనందబాబు విమర్శించారు. ఈ అంశాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. మధ్యంతర బెయిల్ కండిషన్లు ఈనెల 28 వరకు అప్లై అవుతాయి. ఆ తర్వాత రెగ్యులర్ బెయిలు. చంద్రబాబు నాయుడు తన పని చేసుకోవచ్చు రాజకీయ సమావేశాలు, ర్యాలీలు, సభల్లో మాట్లాడటం చేసుకోవచ్చు. ఈ కేసు గురించి మాట్లాడవద్దని మాత్రమే హైకోర్టు చెప్పింది. ఎఫ్ ఐ ఆర్ లో పేరు పెట్టినంత మాత్రాన అతను ముద్దాయి అయిపోడు. కానీ ఈ సీఐడి బాస్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దేశమంతా తిరిగి ప్రెస్ మీట్ లు పెట్టి మరీ చంద్రబాబు దోషి అని చెప్పారు. దానికి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దాని మీద కూడా కోర్టు ఒకసారి ఆలోచించాలి. జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు. తాము తప్పకుండా ఈ అంశం మీద కోర్టుకు వెళతామని ఆనందబాబు చెప్పారు.
42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, ప్రతి రెండు సంవత్సరాలకి సభ్యత్వం చేర్పిస్తాము. వంద రూపాయలు సభ్యత్వం అంటే కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉంటాయి, మాకు కార్యకర్తల సంక్షేమ నిధి ఉంది. కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉంది. అసలు పార్టీ పరంగా ఎటువంటి మౌలిక నిర్మాణం లేనటువంటి వైసీపీ కే రూ. 150 కోట్ల విరాళాలు వస్తే, టీడీపీ దగ్గర రూ. 27 కోట్లు ఉండటం పెద్ద విషయం ఏమి కాదు. ఆ లెక్కలన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి చూపిస్తాం. వైసీపీ అకౌంట్ లో ఎన్ని కోట్ల సొమ్ము ఉందో బహిరంగంగా చెప్పాలి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు రూ. 470 కోట్లు అవినీతి అన్నారు. తర్వాత 370 కోట్లు అన్నారు. ఆ తర్వాత 250 కోట్లు అన్నారు చివరికి 27 కోట్లు పార్టీ అకౌంట్లోకి వచ్చాయి అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ రెడ్డి నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆనందబాబు తెలిపారు.