- పేదలు, మహిళల ఇళ్లకై ఉద్యమించిన ఎమ్మెల్యే నిమ్మల అరెస్ట్
- మాజీ ఎమ్మెల్సీ అంగర కూడా..
- పోలీసులు, లబ్ధిదారులు మధ్య తోపులాట,వాగ్వాదం
పాలకొల్లు: పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యూహం ఫలించింది. టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామంటూ బుధవారం తలపెట్టిన పాలకొల్లు చూడు అనే నిరసన కార్యక్రమంలో వంటావార్పు బహిరంగ సభలు జరగకపోయినా వేలాది మంది లబ్ధిదారులైన పేదలు, మహిళలు, టీడీపీ, జనసేన శ్రేణులతో ఆందోళన కొనసాగింది. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య కుమ్ములాట, వాగ్వాదం వంటివి చోటు చేసుకున్నాయి. దాదాపు 5 గంటలసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే నిమ్మల నిరసన కార్యక్రమాల్లో భాగంగా టిడ్కో ఇళ్ల సముదాయంలో తలపెట్టిన వంటావార్పు, బహిరంగ సభలకు వెళ్లేందుకు పూలపల్లి అంబేద్కర్ విగ్రహ సెంటర్‌కు రమ్మని పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే ఇంటి వద్దకు, పూలపల్లి సెంటర్ కు వేలాదిగా ఆందోళనకారులు తరలివచ్చారు. టిడ్కో గృహాల వద్దకు వెళ్లకుండా ఎమ్మెల్యే నిమ్మలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారు. పూలపల్లి సెంటర్ తో పాటు పలు ప్రధాన రహదారుల వద్ద లబ్ధిదారులు రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ లెక్క చేయకుండా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్యే నిమ్మల బయటికి రాగానే అరెస్ట్ చేద్దామని ఎదురు చూసిన పోలీసుల కళ్ళుగప్పి ఆయన పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విషయం తెలిసి ఉలిక్కిపడిన పోలీసులు ఆయన్ని పట్టుకునేందుకు పరుగులు తీశారు. అలాగే వేలాదిమంది కార్యకర్తలు పూలపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నిమ్మలకు మద్దతు పలికారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మల, జనసేన నాయకుడు సిద్ది రెడ్డి అప్పారావు లు పూలమాలలు వేశారు. టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వేలాది మందితో ఎమ్మెల్యే వెళ్లేందుకు సంసిద్ధులు అవుతుండగా పోలీసులు వలయంగా ఆయనను చుట్టేసి దిగ్బంధనం చేశారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట, వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఎట్టకేలకు రామానాయుడుని అదుపులో తీసుకొని పోలీస్ జీపు ఎక్కిస్తుండగా ఆయన కింద పడిపోయారు. అయినప్పటికీ పోలీసులు కార్యకర్తలను గెంటేసి ఆయనను బలవంతంగా ఈడ్చుకుంటూ అరెస్టు చేశారు. దీంతో మహిళలు పెద్దఎత్తున పోలీస్ జీప్ కు అడ్డు తగిలినప్పటికీ వారిని పక్కకు లాగేశారు. ఎమ్మెల్యే నిమ్మలను లంకలకోడేరు, కొమ్ముచిక్కాల, ఆలమూరు, మార్టేరు మీదుగా పెనుగొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ను కొందరు అనుచరులు కూడా దారిలోనే పోలీసులు అడ్డగించి పట్టణ పోలీసుల స్టేషన్ కు తరలించారు. దీంతో ఆయన స్టేషన్ లోనే కింద కూర్చుని నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగరను మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి విడిచిపెట్టారు.
ఈ తోపులాటలో పట్టణానికి చెందిన మురాల ధనలక్ష్మి లంకలకోడేరుకు చెందిన తాళ్లూరు విజయలక్ష్మి మహిళలకు గాయాలయ్యాయి. ఓ చిన్నారి కాలికి గాయం అయింది. ఆమెను వెంటనే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆందోళన జరుగుతున్నంతసేపు లబ్ధిదారులు, టీడీపీ, జనసేన శ్రేణులు పార్టీ జెండాలు, జాతీయ జెండాలు చేత పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పితాని సంఫీుభావం
పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కలిసి సంఫీుభావం తెలిపారు. పేదలు,మహిళల ఇళ్ల కోసం మీరు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం అంటూ భరోసా ఇచ్చారు.