నిధుల కొరత, ప్లానింగ్ లేకపోవడం, రివర్స్ డ్రామాల వల్ల తీవ్రజాప్యం
చంద్రబాబు హయాంలో రూ.10,584కోట్ల ఖర్చు, 72శాతం పూర్తి
జగన్‌రెడ్డి హయాంలో 37 నెలల్లో రూ.2,742 కోట్ల ఖర్చు
బడ్జెట్‌లో రూ.11,460 కోట్లు చూపి, 25 శాతం కూడా ఖర్చుచేయలేదు
మూడుసార్లు డెడ్‌లైన్లు మార్చిన జగన్ రెడ్డి
అమరావతి: పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినప్పటికీ లెక్కచేయకుండా ఏజెన్సీని మార్చడం పెద్ద తప్పుని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం నిర్మాణంలో నిధుల కొరత, ప్లానింగ్ లేకపోవడం, రివర్స్ డ్రామా… వల్ల తీవ్రజాప్యం జరుగుతున్న తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అథారిటి, నీతిఆయోగ్ కలిసి వివిధ విభాగాల ద్వారా సమాచారం సేకరించి కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక సమర్పించాయి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై నీతిఆయోగ్ సూచనల మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీవారికి నివేదిక అందింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ సీనియర్ ఇంజినీరింగ్ అధికారి ప్రొఫెసర్ కె.బి.వి.ఎన్. ఫణీంద్ర నాయకత్వంలో జల వనరులు, ఆర్థిక, పునరావాస నిపుణులు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సామాజిక నిపుణురాలు, ఆర్‌అండ్‌ఆర్ నిపుణులు, లిబరల్ ఆర్ట్స్ కలిసి ఐదుగురు సభ్యుల నాయకత్వంలో 124 పేజీల నివేదికను తయారుచేశారు. 2020-21లో ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో 53 రోజులు, పది సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. హెడ్ వర్క్స్, ప్రాజెక్ట్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించారు. ల్యాండ్ ఎక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ భాదితులతో సమావేశాలు నిర్వహించారు. నివేదిక తయారుచేసి కేంద్ర జలవనరుల శాఖకు నివేదిక అందించారు. థర్డ్ పార్టీ వాల్యూషన్ ఆఫ్ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి నవంబరు 2020-21లో నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జల వనరుల శాఖకు నివేదిక వెళ్లింది. ఆ నివేదికలో 2015 నుంచి 2019 వరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, శరవేగంగా, సమర్థవంతంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేశారని పేర్కొన్నారు. 2014లో స్పిల్ వే ద్వారా నీటి పారుదల జరిగినట్లు చాలా స్పష్టంగా ఆ నిపుణుల కమిటీ నివేదికలో తెలిపారు. నేడు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, ముఖ్యమంత్రి అసమర్థత వల్ల పోలవరంలో విధ్వంసం జరిగింది.
నిర్మాణ సంస్థని మార్చడం సరిదిద్దుకోలేని తప్పు
ఇది జాతీయ ప్రాజెక్ట్. 50 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్ట్. 50లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునే విధంగా స్పిల్ వే నిర్మాణం చేశారు. మీ ప్రణాళికాలోపం వల్ల, సమన్వయం లేక నిర్మాణ సంస్థని అర్థంతరంగా మార్చేయడం వల్ల సరిదిద్దుకోలేని తప్పు జరిగిందని నిపుణులు కమిటీ తేల్చి చెప్పింది. నిధుల కొరత తీవ్ర జాప్యం జరగడం, దిగువ కాపర్ డ్యాం మీద అలసత్వం, 30.5 మీటర్లు దిగువ కాపర్ డ్యాం చేయాల్సిన నిర్మాణం చేయకపోవడం వల్ల ఎగువ కాపర్ డ్యాం, దిగువ కాపర్ డ్యాం మధ్యలో నీరు నిలబడి నేడు పని చేయాల్సిన ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోయింది. ఇది చారిత్రాత్మక వైఫల్యం. ఎగువ కాఫర్ డ్యాంలోని ఖాళీలని పూర్తి చేయలేక పోయారు. 2019లో వచ్చిన 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన స్పిల్ వే ద్వారా స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్ లో పడి ధవళేశ్వరం బ్యారెజ్ ద్వారా సముద్రంలోకి చేరాయి. 2022 లో వచ్చిన 22లక్షల క్యూసెక్ ల వరద నీటి ప్రభావం డయాఫ్రమ్ వాల్ మీద పడింది. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం జరుగుతన్నప్పుడు మే 19 నాటికి అధికారంలోకి వైసీపీ వచ్చింది. జూన్ మొదటి వారం నాటికి డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగింది. గోదావరికి వరదలు వచ్చే సమయంలో ఆ తాకిడిని కూడా తట్టుకునేవిధంగా జర్మనీ బావరీ సంస్థ, ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్ లో నిర్మాణం జరిగింది. దాని మీద అప్పర్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణ పనులు మొదలు పెట్టాలి. ఎగువ కాఫర్ డ్యాం గ్యాప్స్ ఫిలప్ చేయాలి. 17 వేల 5 వందల మంది నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని నివేదికలో చెప్పడంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అత్యవసర సమావేశాలలో కూడ చెప్పారు. ఏజెన్సీలు మార్చోద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని పోలవరం ప్రాజెక్ట్ సిఇవో స్పష్టంగా వ్యక్తపరిచారు. ఈ వైఫల్యం గురించి ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి.
చంద్రబాబు హయాంలో 72శాతం పనులు పూర్తి
గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులను పూర్తి చేశారు. పక్కా ప్రణాళికతో, నిధులను కేటాయించి, రీయింబర్స్ లో కేంద్రం ప్రభుత్వం నుంచి రూ.6 వేల 5 వందల కోట్ల నిధులను తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఖర్చుపెట్టిన రూ.4వేల కోట్ల నిధులు వస్తే, వాటిని మీరు ప్రాజెక్ట్ కోసం, నిర్వాసితుల కోసం చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాలలో రూ.10వేల 5వందల 84కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. 37 నెలలో మీరు రూ. 2,742 కోట్లు ప్రణాళిక, అవగాహన లేకుండా ఇష్టానుసారం ఖర్చు చేశారు. బడ్జెట్ లో రూ.11వేల 460కోట్లు పెట్టినట్లు చెప్పారు. కాని ఖర్చు పెట్టింది రూ.2, 742కోట్లు మాత్రమే. కనీసం 25శాతం కూడా లేదు. ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ అన్ని కూడా నిర్లక్ష్యం చేశారు.
పోలవరం నిర్వాసిత ప్రాంతాలలో ఏడు ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో కలిపితేనే పోలవరం కల సాకారం అవుతుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ఒప్పించి చేర్చారు. నేడు వరద ముంపు ప్రాంతాల్లో వైసీపీ నుంచి గెలిచిన సర్పంచ్ లే ధర్నాలు చేసే పరిస్థితి కనపడుతుంది. మంచినీరు అందలేదని, రెండు వారాలుగా కరెంటు లేదని, నివాసిత ప్రాంతాలలో పాములు, తేళ్లు వస్తున్నాయని వారు గగ్గోలుపెడుతున్నారు. కనీసం భోజన వసతి సదుపాయంలేదని పక్క రాష్ట్రం ముంపు బాధితులకి 10వేల రూపాయలు అందజేస్తే మాకు కనీసం 2వేల రూపాయలు కూడ ఇవ్వడం లేదంటున్నారు. 5కిలోల బియ్యం కూడ ఇవ్వలేదు, కూరగాయలు ఇవ్వలేదని రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రికి సిగ్గుగా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? వేలాది మంది నిర్వాసితులు రోడ్డెక్కుతుంటే మీరు బాధ్యత లేకుండా గాల్లో తిరుగుతూ గాలి కబుర్లు చెప్తారా?
చంద్రబాబు నాయుడు రెండు ముంపు ప్రాంతాలలో పర్యటించి వారు పడుతున్న బాధలు చూశారు. వాళ్లు తాగే నీరు కూడ అందరికి చూపించారు. ప్రజలు ఇంత కష్టాలు పడుతుంటే మీకు చీమ కుట్టినట్టైన లేదు.
ప్రాజెక్టు నిర్మాణంపై మూడుసార్లు డెడ్‌లైన్లు మార్చిన జగన్‌రెడ్డి
నవంబరు 21న నివేదిక వస్తే ముఖ్యమంత్రి ఏ విధంగా మూడు సార్లు జూన్ 2021, 2022, 2023కి పూర్తి చేస్తానని సంవత్సరాలు మార్చుకుంటూ ప్రాజెక్ట్ కి డెడ్ లైన్స్ పెడతారు? ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు సార్లు డెడ్ లైన్ లు మార్చారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని నాశనం చేయొద్దు, ముంచొద్దు, అన్యాయం చేయొద్దని 47 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు చేతులెత్తి అసెంబ్లీలో చెప్పినా వినలేదు. జగన్ మూర్ఖత్వం, తెలివితక్కువ, చేతకానితనంవల్ల, అసూయ, ద్వేషం వల్ల 72 శాతానికి వెళ్లిన పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. 53 రోజులు 10 సార్లు డ్యామ్ సైట్ కు వెళ్లారు. నిర్వాసితుల వద్దకు వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు. వీటిపైన జగన్ మాట్లాడాలి. ప్రజలకు జీవనాడి, ప్రాణనాడి అయిన పోలవరం విషయాన్ని రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు సత్యాలను గ్రహించాలి. దీనిపై కేంద్రం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలవనరుల శాఖ మంత్రి స్పందించాలి. ఈ విధ్వంసాన్ని ఆపాలి. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారనడానికి రిపోర్టులే సాక్ష్యం. ఈ ముఖ్యమంత్రికి పరిపాలనార్హత లేదని దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు