విజయనగరం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ లభించటంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ఇవాళ చంద్రబాబుకు బెయిల్ వచ్చిందంటే ఆయనొక్కరే ఈ పోరాటంలో గెలిచారని కాదు..ఆయన కుటుంబం గెలిచిందని కాదు… ఈ పోరాటంలో ప్రజలు గెలిచారు, మహిళా శక్తి గెలిచింది. వాళ్లందరికీ నా తరఫున, మా కుటుంబం తరఫున పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు.
నారా భువనేశ్వరి రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వెళ్లి అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ సమయంలో చంద్రబాబును మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసింది. దీనిపై మీడియాతో మాట్లాడుతూ ఆమె తన స్పందన తెలియజేశారు.