అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్‌లు గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావొద్దని, కొండ చరియలు విరిగిపడే, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారిక సహాయక చర్యలకు పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విపత్తుల కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని మంత్రి లోకేష్ సూచించారు.
మంగళగిరిపై గంటగంటకూ సమీక్ష
మంగళగిరి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఎప్పటికపుడు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. టీడీపీ కార్యాలయ కంట్రోల్ రూమ్ ద్వారా గంటగంటకు పరిస్థితులను వాకబు చేస్తూ సహాయ చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. వరద ముంపునకు గురైన రత్నాలచెరువు ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు. భారీవర్షం కారణంగా స్థంభించిన రోడ్లను వెంటనే క్లియర్ చేసి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరారు. తుపాను తీవ్రరూపం దాల్చుతున్నందున అధికారులంతా 24/7 అందుబాటులో ఉండాలని, అవసరాన్ని బట్టి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.