అమరావతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు వెళ్లిన వ్యక్తులను చూసి ప్రధానమంత్రితో పాటు, దేశం మొత్తం ఆశ్చర్యానికి గురైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగటం దేశం మొత్తం మీద ఏపీ లోనే సాధ్యమన్నారు. కేవలం ఒకే సామాజికవర్గానికి చెందిన వారు మాత్రమే ప్రధానికి స్వాగతం పలకడం పట్ల యావత్ రాష్ట్ర ప్రజలు విస్మయానికి గురయ్యారని మంగళవారం ఒక ప్రకటనలో వర్ల రామయ్య పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మొదలు టీటీడీ ఈఓ వరకు మొత్తం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఓ వైపు సామాజిక సాధికార బస్సు యాత్రలు చేస్తూనే.. ఇతర కులాలను ఈ విధంగా అవమానించడమేనా సామాజిక సాధికారత అంటే అని వర్ల ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి నోరు విప్పాలి…
ప్రధానికి స్వాగతం పలకడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర కులాలకు అర్హత లేదా? నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అక్కలు, నా చెల్లెళ్లు, నా అవ్వలు, నా తాతలు అంటూ బహిరంగ సభలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో గుండెలు బాదుకునే జగన్మోహన్‌రెడ్డికి వీళ్లెవరూ ప్రధానికి స్వాగతం పలికే సమయంలో గుర్తు రాలేదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మాత్రమే రాష్ట్రంలో ఉన్నతమైన వారా? ప్రధానికి స్వాగతం పలికే అర్హత వీళ్లకే ఉందా? ఇతర కులాల వారు ఎవరూ ఉన్నతమైన వారు కాదా, వాళ్లకు అర్హత లేదా అని వర్ల ప్రశ్నించారు.
సామాజిక న్యాయం చేసింది కేవలం జగన్మోహన్‌రెడ్డే అని చెప్పుకుంటూ బస్సు యాత్రలకు తిరుగుతున్న మంత్రులు నేడు ఏ ముఖం పెట్టుకుని సామాజిక సాధికార తుస్సు యాత్రలు చేస్తారు? ప్రధానికి స్వాగతం పలకడానికి సొంత కులానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిపై రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులు తమకు దక్కిన సామాజిక న్యాయంపై నోరెత్తగలరా? జగన్మోహన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్య పాలన జరగడం లేదు… కేవలం రెడ్డి రాజుల పాలనే జరుగుతోంది అని చెప్పడానికి ప్రధానమంత్రికి కేవలం రెడ్డి కులస్థులు మాత్రమే స్వాగతం పలకటమే నిదర్శనం. కాదని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? సామాజిక న్యాయం, అన్ని కులాల వారికి ప్రాధాన్యం లభించటం తెలుగుదేశంపార్టీ, చంద్రబాబుతోనే సాధ్యం.. వైసీపీ పాలనలో సామాజిక న్యాయం మంటగలిసింది… సామాజిక న్యాయం
అందించకుండానే అందించామని చెబుతున్నందునే ప్రజలెవ్వరూ ఈ వైసీపీ తుస్సు యాత్రలకు వెళ్లడం లేదు… ఒకవేళ వెళ్లినా సభల్లో కూర్చోవడం లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు… ఎండ మావిలో నీళ్లు కనబడవు…జగన్మోహన్‌రెడ్డి పాలనలో సామాజిక సాధి కారత, న్యాయం కనబడదు. వైసీపీ పని అయిపోయిం ది అనడానికి సామాజిక సాధికార తుస్సు యాత్రలే నిలువెత్తు సాక్ష్యం. 2024లో టీడీపీ-జనసేనల ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది… సామాజిక న్యాయం తిరిగి జీవం పోసుకోబోతోంది.