చంఢీగఢ్: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం కోటా అంశంలో హరియాణా ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన చట్టాన్ని అక్కడి హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 18లను ఈ చట్టం ఉల్లంఘించిందని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 2020లో నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. నెలకు రూ.80వేల వేతనం కంటే తక్కువ వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు 75శాతం కోటా కల్పించే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. అయితే, దీనిపై ప్రైవేటు రంగం, పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పారిశ్రామిక రంగానికి తీవ్ర నష్టం కలిగించడంతోపాటు పెట్టుబడుల పైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రైవేటు సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఇలా స్థానిక రిజర్వేషన్లపై హరియాణా ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని పంజాబ్ హరియాణా హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ హరియాణా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేవలం 90 సెకన్లలోనే హైకోర్టు విచారణ పూర్తి చేసిందని వాదించింది. దీంతో ఈ ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. ఇలా ఫ్రైవేటులో స్థానిక కోటాకు సంబంధించిన పిటిషన్లను విచారించిన పంజాబ్ హరియాణా హైకోర్టు… ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.