అమరావతి: గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా హృదయంతో సాయం చేయాల్సింది పోయి, వాళ్ళ కష్టాలను నాతో చెప్పుకున్నందుకు బెదిరిస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. వేలేరుపాడులో నేను పర్యటించినప్పుడు వరద సాయం అందలేదని మాతో చెప్పుకున్న బాధిత మహిళలను పునరావాసం కేంద్రం నుంచి వెళ్లగొట్టడం, పైగా బెదిరించడం దారుణమన్నారు. ఈ ఘటనపై చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందిస్తూ… వైసీపీ నేతల క్రూరత్వం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. రెవెన్యూ ఉద్యోగులు కూడా వారికి వంత పాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనమేమన్నా ఆటవికయుగంలో ఉన్నామా? ప్రతిపక్ష నేతలకు కష్టాలు చెప్పుకున్నందుకు ప్రతీకార చర్యలా? ప్రజలను ఆదుకోకుండా తప్పుచేసింది మీరు కాదా? వైసీపీ నేతల ఈ శాడిజాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.