కడప: కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత, పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవిని భాజపా ఎంపీ సీఎం రమేశ్ మంగళవారం పరామర్శించారు. 10 నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసులో పోలీసులు అరెస్టు చేయటంతో బీటెక్ రవికి న్యాయస్థానం రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. రవిని కలిసిన తర్వాత సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడారు. బీటెక్ రవిని ఈ నెల 14న కిడ్నాప్ చేసి చంపేయాలనుకున్నారు. కడప నగర శివార్లలో పోలీసు వాహనంలో మూడు గంటల పాటు తిప్పారు. ఆ తర్వాత పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లారు. నిజం చెప్పకపోతే చంపేస్తామని బీటెక్ రవిని బెదిరించారు.
బతికి ఉంటే కదా నువ్వు పులివెందులలో పోటీ చేసేది అని హెచ్చరించారు. మీడియా వల్లే రవి బయటపడ్డారు. ఈ వ్యవహారం అంతా మీడియాలో వస్తుందని తెలియగానే పాత కేసులో అరెస్ట్ చూపించారు. సీఐ అశోక్ రెడ్డి వైకాపాకు తొత్తుగా పని చేస్తున్నారు. అశోక్ రెడ్డికి కచ్చితంగా బుద్ధి చెబుతాం. ఎవరి కోసమో ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంటాం. అశోక్ రెడ్డి అండ్ టీమ్… బీటెక్ రవిని కిడ్నాప్ చేసింది. అందుకు సంబంధించిన ఆధారాలున్నాయి. సీఎం జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయి. బీటెక్ రవిని అరెస్టు చేసిన తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని సీఎం రమేశ్ తెలిపారు.