హైదరాబాద్ (చైతన్యరథం): సతీ వియోగంతో బాధపడుతున్న మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ను గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం పరామర్శించారు. ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సంధ్యారాణి హైదరాబాద్‌లోని ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఫరూక్ మా అందరికీ ఒక సీనియర్ నాయకుడిగా మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు. ఆయన అనుభవం, సహాయ సహకారాలు మాకు ఎంతో కీలకం. ప్రత్యేకంగా నూతన మంత్రులుగా మేము ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించినప్పుడు, ఆయన మాకు మార్గనిర్దేశకుడిగా ఉండి ప్రోత్సహించారు. ఫరూక్ మార్గదర్శకత, నాయకత్వ లక్షణాలు మాకు పాఠంగా నిలుస్తాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, వారు ఈ విషాదాన్ని అధిగమించాలని ఆకాంక్షిస్తున్నాను. షహనాజ్ ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు. ఫరూక్ వ్యక్తిత్వం, ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఈ విషాద సమయంలో పార్టీ, మంత్రివర్గం ఆయన వెంటే ఉంటుందని తెలిపారు.