అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు భార్యావియోగం కలిగింది. ఆయన భార్య షహనాజ్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అర్ధాంగి షహనాజ్ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం చంద్రబాబు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని అల్లాను ప్రార్థిస్తున్నానని, ఈ కష్ట సమయంలో గుండె నిబ్బరంతో ఉండాలని మంత్రి ఫరూక్‌ను కోరుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి: మంత్రి లోకేష్
మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి పట్ల విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆమె ఇంతిఖాల్ అయ్యారు. ఆమెకు జన్నత్‌లో ఉన్నతమైన స్థానం ప్రసాదించాలని, ఆత్మకు శాంతి కలగాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానన్నారు.
మంత్రి ఆనం సంతాపం
నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణ వార్త పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులు ఈ క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.
ఫోన్‌లో మంత్రి డోలా పరామర్శ
మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సతీమణి మృతి పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంతాపం తెలిపారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న మంత్రి డోలా వెంటనే మంత్రి ఫరూక్‌ను ఫోన్లో పరామర్శించారు. ఆమె మృతి వారి కుటుంబానికి తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ అల్లా వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని మంత్రి డోలా ప్రార్థించారు.
ఫరూక్‌కు మంత్రి జనార్థన్ రెడ్డి పరామర్శ
మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్ సతీమణి షహనాజ్ అకాల మృతిపట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే ఫోన్‌లో మంత్రి ఫరూఖ్‌ను బీసీ జనార్థన్ రెడ్డి పరామర్శించారు. నంద్యాల జిల్లాలో తన సహచర మంత్రి, తనకు అత్యంత ఆప్తులైన ఫరూఖ్ సతీమణి షహనాజ్ మృతి అత్యంత బాధాకరం అన్నారు. ఫరూఖ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సంతాపం తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇవ్వాలని అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర సంతాపం
మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ మృతి పట్ల గనులు, భూగర్భ వనరులు, ఎక్సయిజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు అల్లా చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. వారి కుటుంబసభ్యులకు ఆ అల్లా మనోధైర్యం కల్పించాలి. ఫరూఖ్ గుండె నిబ్బరంతో ఉండాలని ఆకాంక్షించారు.
మంత్రి నాదెండ్ల విచారం
మంత్రి ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణం పట్ల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబం ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకుని కోలుకోవాలని ఆకాంక్షించారు.