పిఠాపురం: మట్టి దొర, అధికార పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది కలిసి పిఠాపురం ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ విమర్శించారు. పిఠాపురం పట్టణంలోని 9వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కూల్చిన ఇళ్లను వర్మ పరిశీలించారు. పట్టణంలో కొత్త ఇంటికి రూ.లక్ష, పాత ఇళ్లకు పర్మిషన్ లేకుంటే రూ.లక్ష వసూలు చేస్తున్నారని విమర్శించారు. 9వ వార్డు ఎస్సీ పేటలో పాత ఇళ్లను అనుమతులు లేవంటూ కూల్చివేశారని విమర్శించారు. పిఠాపురం మున్సిపాలిటీలో అధికార పార్టీ కౌన్సిలర్లు, సిబ్బంది కుమ్మక్కై ఎస్సీ కాలనీల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా పెట్టుకుని పాత ఇళ్లకు కూడా అనుమతి లేదంటూ అన్యాయంగా కూల్చేస్తున్నారన్నారు. ఒక్కో ఇంటికి రూ.10 వేలు ఇవ్వాలని అధికార పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర రావు, మోర్త చిన్న పండు, పెదపాటి వీర వెంకటరమణ, సింగారపు మరియమ్మ, సిరా శ్రీను, మిరియాలు అప్పన్న, పెదపాటి కామరాజు, పుష్ప, మోర్త చిన్న లక్ష్మి, పిల్లి చిన్న, నల్లా శ్రీను, కోరుప్రోలు శ్రీను తదితరులు పాల్గొన్నారు.