అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్ర మత్స్య రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేశామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేశారన్నారు. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులకు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ సముద్రతీరం, నిపుణులైన మన మత్స్యకుటుంబాలు రాష్ట్రానికి ఓ వరమన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు రాష్ట్ర మత్స్య రంగం అభివృద్ధి కోసం 2014-19 ఐదేళ్ల కాలంలోనే ఏకంగా రూ.788.38 కోట్లను ఖర్చు చేశాం. ఆదరణ పథకం కింద వలలు, పడవలు, ఐస్ బాక్సులు సహా ఇతర వృత్తి పరికరాలను 90శాతం సబ్సిడీతో అందించాం. ఇన్ ఇన్ ల్యాండ్ సొసైటీ మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీతో వలలు, పడవలు అందించాం. డీప్ సీ ఫిషింగ్ నెట్స్, ఏరియేటర్స్, ఇన్లాండ్ నెట్స్, ఇన్లాండ్ బోట్స్, ఫైబర్ బోట్స్, గిల్ నెట్స్, రిఫర్ వ్యాన్స్, సముద్రపు పంజరాలు అందించాం. డీజిల్ సబ్సిడీ తీసుకొచ్చి మత్స్యకారులకు తోడుగా నిలిచాం. దేశంలో తొలిసారిగా 50ఏళ్లు దాటిన మత్స్యకారులకు పెన్షన్ అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. మత్స్యకారుల పిల్లల చదువుల కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాం. వేటకు వెళ్లి మరణించిన వారికి నెల రోజుల్లోనే డెత్ సర్టిఫికెట్ అందించి రూ.5లక్షల బీమా కల్పించాం. హేచరీల్లో చేపపిల్లలు పెంచి చెరువులు, రిజర్వాయర్లలో వదిలి మత్స్యకారులకు వేట బాధ్యతలు అప్పగించాం.
గతంలో ఆక్వా ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, చేతకానితనంతో దిగజారిపోయింది. ఆక్వా రైతులకు జగన్ రెడ్డి వచ్చాక విద్యుత్ సబ్సిడీ నిలిపివేశారు. రాష్ట్రంలోని చెరువులు, రిజర్వాయర్లను మత్స్యకార సొసైటీలకు కాకుండా బహిరంగ వేలం వేసేలా జీవో నెం.217 తెచ్చి మత్స్యకారుల పొట్టకొట్టారు. రాష్ట్రంలోని మత్స్యకారులకు, మత్స్యరంగానికి మెరుగైన రోజులు రావాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలందరిపైనా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.