శ్రీకాకుళం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్నెట్ను ఊపేస్తున్న నేటి తరుణంలో మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో ఇటీవల ఇంటర్నెట్లో వైరల్గా మారిన నేపధ్యంలో కేంద్ర సాంకేతిక శాఖామంత్రి అశ్విన్ శ్రీవైష్ణవ్కు రామ్మోహన్నాయుడు మంగళవారం లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతలో వస్తున్న నూతన ఆవిష్కరణలను ఆహ్వానించాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే.. అది సవ్యమైన రీతిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీపై ఆయన స్పందిస్తూ ఇందులో… ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో ఉదంతాన్ని ప్రస్తావించారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో మానవ ప్రమేయం లేకుండానే అసాంఘిక కార్యకలాపాలకు తెరదీయవచ్చని పేర్కొన్నా రు. సినీ నటి ఘటనే దేశంలో సామాన్య యువతికి ఎదురైతే.. ఆమె భవిష్యత్, కుటుంబం పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. విపరీత సౌలభ్యం అనేది అటు మన ఇంటి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో పాటు దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎత్తి చూపారు. పెరుగుతున్న సాంకేతి కత అనేది ఉత్పాదనలో అదనపుబలంగా ఉండాలి తప్పించి.. మానవ సంబంధాలకు ప్రమాదం కలిగించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని, దేశంలో డీపీ ఫేక్ సాంకేతికత ఇష్టానురీతి వినియోగం, నియంత్రణపై నిపుణులైన వారితో పున:పరిశీలించాలని రామ్మోహన్నాయుడు కోరారు.