- బాపట్ల వద్ద తీరం దాటిన తీవ్ర తుఫాన్
- పంటలకు తీవ్ర నష్టం
- చెరువులను తలపించిన రోడ్లు, కాలనీలు
- కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- జనజీవనం అతలాకుతలం
అమరావతి: తీవ్ర తుఫాన్ మిచౌంగ్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తీరాన్ని తాకిన తుఫాన్ సాయంత్రం 4 గంటకు పూర్తిగా తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మిచౌంగ్ తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడి సాధారణ తుఫాన్‌గా, అనంతరం అర్ధరాత్రికి వాయుగుండంగా మారింది. తుఫాన్ ప్రభావంతో మంగళవారం తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో సాధారణ వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.
తుఫాన్ తీరం దాటుతున్న సమయంలో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. సముద్రంలో అలలు సుమారు 2మీటర్ల మేర ఎగసిపడ్డాయి. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడటంతో ఇళ్లు కోతకు గురయ్యాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీశాయి. దీంతో ఎక్కడకక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వాన, గాలులతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచింది.
తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా పలు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ముంచెత్తాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తిరుపతి జిల్లా చిట్టేడులో అత్యధికంగా 38 సెం.మీ., నెల్లూరు జిల్లా మనుబోలులో 36.8 సెం.మీ., తిరుపతి జిల్లా అల్లంపాడులో 35 సెం.మీ వర్షపాతం నమోదైంది. చిల్లకూరులో 33 సెం.మీ, నాయుడుపేటలో 28.7 సెం.మీ, ఎడ్గలి 24 సెం.మీ, బాపట్ల 21 సెం.మీ, మచిలీపట్నం 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో చాలా చోట్ల 10సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలపాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని చర్యలు చేపట్టారు. తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో అలలు ఎగసిపడ్డాయి. సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. అక్కడి తుపాను రక్షిత భవనంలో స్థానిక గిరిజనులకు పునరావాసం కల్పించారు. వర్షం, గాలుల తీవ్రతకు సూర్యలంక బీచ్ పోలీస్ అవుట్ పోస్ట్ కూలిపోయే స్థితిలో ఉంది. సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బాపట్ల పట్టణంలో రోడ్లపై వరదనీరు మోకాళ్ల లోతు వరకు చేరింది. రోడ్లుపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో భారీ వర్షాలకు ఎక్కడకక్కడ రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. ఆర్టీసీ డిపో, లూథరన్ గ్రౌండ్, బ్యాంకు కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మెంటే వారి తోట, దుర్గాపురం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా మార్గాల్లో ప్రయాణించడానికి వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. భీమవరం-తాడేపల్లిగూడెం రహదారిలో గరగపర్రు వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీ వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో మంగళవారం ఉదయానికి 55.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 43.9 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదయింది. మంగళవారం ఉదయం ఆకివీడులో అత్యధిక వర్షపాతం 139.2 మిల్లీమీటర్లు నమోదయింది. కాళ్లలో 135.2 నమోదు కాగా అత్యాల్పంగా తణుకులో మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
నీటమునిగిన తిరుపతి, నెల్లూరు జిల్లాలు…
తుఫాన్ ప్రభావంతో.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో రైల్వే అండర్‌పాస్ వద్ద నడుంలోతు నీరు నిలిచింది. పలు కాలనీల్లోనూ మోకాల్లోతు నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసరాలు, వస్తువులు తడిసిపోయాయి. సైదాపురం మండలంలో కైవల్యనది ఉధృతంగా ప్రవహిస్తోంది. నెల్లూరులోనూ పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. నెల్లూరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సుమారు 100 బస్సులను రద్దు చేశారు.
నదులకు భారీగా వరద…
తిరుపతి జిల్లాలో కాళంగి, మల్లెమడుగు, స్వర్ణముఖి నదులకు భారీగా వరదనీరు చేరింది. గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కోట, శ్రీకాళహస్తి, ఏర్పేడు, వాకాడు తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తిరుమల ఘాట్‌రోడ్డ్డులోనూ కొన్నిచోట్ల చెట్లు కూలగా.. వెంటనే తొలగించారు. శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధిలో వందేళ్లనాటి చెట్టు కూలింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టోల్ ప్లాజా సమీపంలోని గోకులకృష్ణ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కాళంగా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై నాలుగు అడుగుల మేర నీటిమట్టంతో వరద ప్రవహిస్తుండటంతో పోలీసులు రహదారిని మూసివేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని రాజీవ్ నగర్ వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల మధ్య వరద నీరు ఏరులా మారింది.
రవాణా వ్యవస్థపై ప్రభావం…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ఎఫెక్ట్ రవాణా వ్యవస్థ పై భారీగా పడిరది. వినమానయానం తో పాటు రైల్వే పై కూడా తూఫాన్ ప్రభావం పడిరది. ఇప్పటికే పలు విమానాశ్రయాలు నీటితో నిండిపోవడం తో వైజాగ్ నుంచి వెళ్లే పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. రైల్వే వ్యవస్థపై కూడా తుఫాన్ ఎఫెక్ట్ పడిరది. దీని కారణంగా సుమారు 150 రైళ్లు అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. కాచిగూడ- చెంగల్పట్టు, హైదరాబాద్- తాంబరం, సికింద్రాబాద్- కొల్లాం, సికింద్రాబాద్- తిరుపతి, లింగంపల్లి- తిరుపతి, సికింద్రాబాద్- రేపల్లె, కాచిగూడ- రేపల్లె, చెన్నై- హైదరాబాద్, సికింద్రాబాద్- గూడూరు, సికింద్రాబాద్-త్రివేండ్రం స్టేషన్ల మధ్య నడిచే రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యవసరమైన ప్రయాణాలు ఉంటే తప్ప మిగతా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
తిరుమలపైనా తుఫాన్ ప్రభావం.. ఘాట్ రోడ్లలో ఆంక్షలు
భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రతా దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో ఆంక్షలు విధించారు. వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. దీంతో వాహన రాకపోకులకు అంతరాయం కలుగుతోంది. ద్విచక్ర వాహనదారులు ముందున్న వాహనాలు సరిగా కనపడక ఇబ్బందులకు గురవుతున్నారు. తద్వారా వాహనాలు, ప్రయాణికులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి సాయంత్రం 8 వరకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు.
తిరుమలలో భక్తుల ఇబ్బందులు…
భారీ వర్షాల కారణంగా తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన తిరుపతికి చెందిన భక్తుడు జారి కిందపడటంతో కాలు విరిగింది. కొండపై ఉన్న అతిథిగృహాలు, రెండు ఘాట్ రోడ్లు, పాపవినాశనం రోడ్డు, శ్రీవారి మెట్టుమార్గంలో పలుచోట్ల భారీ చెట్లు కూలడంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. పాపవినాశనం, శ్రీవారిమెట్టు, కపిలతీర్థం. జాపాలి మార్గాలను తితిదే మూసివేసింది. ఘాట్రోడ్లలో ద్విచక్రవాహనదారులకు పరిమితులు విధించారు. తిరుమలలోని జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువయ్యాయి.
పునరావాస శిబిరాలు…
తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 211 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 10 వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రభుత్వం తుఫాన్ సహాయ చర్యల కోసం 11 జిల్లాలకు 20 కోట్ల నిధులను విడుదల చేసింది. విపత్తుల నిర్వహణశాఖ 4కోట్ల మందికి మొబైల్స్‌కు అలర్ట్ మెసేజ్‌లు పంపారు. ప్రజలను రక్షించేందుకు పలు కేంద్రాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మొహరించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలకు ఒక్కోటి, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు రెండేసి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తరలించారు. కృష్ణా, తిరుపతి, బాపట్ల జిల్లాలకు ఒక్కోటి, నెల్లూరు జిల్లాకు 3 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తరలించారు. ఇప్పటివరకు 25 మండలాలు, 54 గ్రామాలు, 2 పట్టణాలపై అధిక ప్రభావం ఉంది.
300 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం…
ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారిసత్రంలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. 300 మంది విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నాగులగుంట చెరువుకు గండిపడి వరద ముంచెత్తి కేజీబీ విద్యాలయాన్ని చుట్టుముట్టింది. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్పందించిన స్థానికులు, అధికారులు విద్యార్థులను ట్రాక్టర్ల ద్వారా బయటకు తీసుకువచ్చారు.
ఇళ్లపై కూలిన పరంజా…
విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులోని భానునగర్‌లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న భవనానికి ప్లాస్టరింగ్ చేసేందుకు కట్టిన పరంజా కూలిపోయింది. తుఫాన్ ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలులతో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు ఐదంతస్తుల పైనుంచి పరంజా కిందకి జారిపోయింది. దీంతో పరంజాకు సంబంధించిన ఐరన్ రాడ్లు పడి ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఐరన్ రాడ్లు పడే సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కాకినాడ జిల్లాలో సుడిగాలి బీభత్సం… జాతీయ రహదారి పక్క నుంచి దూసుకొచ్చిన వైనం
కాకినాడ: అమెరికాలో భూమిపై నుంచి ఆకాశం వరకు సుడులు తిరుగుతూ తీవ్ర విధ్వంసం సృష్టించే టోర్నడోల గురించి తెలిసిందే. తాజాగా, మిచౌంగ్ తీవ్ర తుపాను ఏపీ తీరాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమయంలో… కాకినాడ జిల్లాలో టోర్నడో తరహా సుడిగాలి బీభత్సం సృష్టించింది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద జాతీయ రహదారి పక్క నుంచి ఈ సుడిగాలి దూసుకువచ్చింది. రహదారిపై వెళుతున్న వాహనాలు సైతం ఈ సుడిగాలి ధాటికి కుదుపులకు లోనయ్యాయి. ఆ తర్వాత రహదారి దాటిన సుడిగాలి పెట్రోల్ బంకు పక్క నుంచి వెళుతూ సమీపంలోని కొబ్బరి తోటపైనా ప్రతాపం చూపించింది. సుడిగాలి ధాటికి కొబ్బరి చెట్లు చెల్లాచెదురయ్యాయి. సుడిగాలి ప్రచండవేగం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.