పోలేపల్లి: జగన్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న దాష్టీకాలను అంతం చేయడానికి టీడీపీ-జనసేన కలయికను జనం కోరుకుంటున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంచి ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నార న్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో బుధవారం జరిగిన యువగళం`నవశకం బహిరంగసభలో నాదెండ్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న దాష్టీకాలు.. దౌర్జన్యాలను కట్టడిచేసేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనన్నారు. నాలుగున్నరేళ్లలో ఇరుపార్టీల నాయకులు అనేక అవమానాలు.. వేధింపులు చూశారు. కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో తెలుగుదేశాన్ని ముందుకు నడిపితే.. పవన్ కల్యాణ్ మన రాష్ట్రంకోసం.. మనకోసం మంచి భవిష్యత్ కోసం వర్తమాన రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా అడుగులేస్తున్నారు. రాజమహేంద్రవరంలో గత సెప్టెంబర్ 13న చంద్రబాబును ములాఖత్ లో కలిసిన రోజు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. లోకేష్ యువగళం పాదయాత్ర సభకు హాజరుకావాలని తనకు ఆహ్వానం అందినప్పుడు లోకేశ్ నాయకత్వం పెంచాలి.. ఆయనే సభకు ముఖ్యఅతిథిగా ఉంటే.. ఆయనకు తగిన గౌరవం లభిస్తుందని పవన్ చెప్పారు. అదే విషయం నేను లోకేశ్ తో చెబితే.. ఇది తన పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదని… జనసేన-తెలుగుదేశం కలిసి మొట్టమొదటి సారి నిర్వహిస్తున్న సభ కాబట్టి కచ్చితంగా పవన్ కల్యాణ్ హాజరు కావాలన్నారు. అవసరమైతే తానే ఒకడుగు వెనక్కు వేస్తాను.. పవన్ కల్యాణ్‌ను ముందుండి నడిపిస్తాను అన్న లోకేశ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టింది. ఉపాధి, ఉద్యోగావకాశాల విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర భవితవ్యాన్ని వెనక్కి నెట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనలతో జరిగిన నష్టాన్ని రాష్ట్ర యువత గుర్తించాలి. ఈ అవినీతి ప్రభుత్వం ఏవిధంగా యువత భవితను అంధకారంలోకి నెట్టిందో చూశాం. గత జనవరిలో రణస్థలంలో జనసేన పార్టీ యుశశక్తి కార్యక్రమం చేపట్టినప్పుడు యువత ఆందోళనను ప్రత్యక్షంగా చూశాం. వారి బాధలు విని ఆవేదనకు గురయ్యాం. రాష్ట్రంలోని వనరుల్ని దోచుకుంటూ.. యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనను ఈ ప్రభుత్వం విస్మరించింది. చంద్రబాబు గతంలో రాష్ట్రం కోసం ఎంత కష్టపడి పనిచేశారో చూశాం. ఒడిశా ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా సింగపూర్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామి అయ్యి… యువతకు మంచి భవిష్యత్ అందిస్తోంది. కానీ మన ముఖ్యమంత్రి 5 ఏళ్లుగా కథలు చెబుతున్నాడు. తిరుపతిలో 50 ఎకరాల్లో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తానన్న జగన్ హామీ ప్రకటనగానే మిగిలిపోయింది.
ఇలాంటి ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ అన్న మాటను నమ్మినందుకు ఏం కోల్పోయామో.. ఎంత కోల్పోయామో తెలుసుకోవాలి. సంక్రాంతి లోపు ఇరుపార్టీలు కలిసి చక్కటి మేనిఫెస్టోను ప్రకటిస్తాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రకటించింది . జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన షణ్ముఖ వ్యూహాన్ని జనసేన జనంలోకి తీసుకెళ్లాలి. చంద్రబాబు అనుభవానికి పవన్ కల్యాణ్ కొత్త ఉత్తేజం తోడై.. అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. లోకేశ్ యువగళం పాదయాత్రలో ఎన్నో లక్షలమందిని కలిశారు. 3123 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్ కు ప్రత్యేక అభినందనలు. పాదయాత్రలో లోకేష్ సంపాదించిన అనుభవంతో సుపరిపాలన చేస్తారని దృఢమైన నమ్మకం ఉంది. పాదయాత్రలో పొందిన అనుభవంతో ఆయన అంకితభావంతో ప్రజలకోసం పనిచేయాలని కోరుతున్నా ను. టీడీపీ-జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయమని అందరూ గ్రహించాలని నాదెండ్ల అన్నారు.