.ద్రౌపది ముర్ము ఎంపికతో సామాజిక న్యాయం!
.ఆమె ఎన్నికలో భాగస్వాములం కావడం అదృష్టం
.సాధారణ మహిళ అత్యున్నతస్థాయికి చేరడం సంతోషం
.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
.సోదరిగా నన్ను బలపర్చిన టిడిపికి కృతజ్జతలు: ముర్ము
.తెలుగు రాష్ట్రాల్లో సామాజిక బాధ్యతగల నేత చంద్రబాబు
.కలామ్ ఎంపికలో ఆయనది కీలక పాత్ర : కిషన్‌రెడ్డి ప్రశంస
విజయవాడ: ఒక పేద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము దేశ ప్రథమ పౌరురాలిగా ఎంపిక కానుండటం యావత్ దేశ ప్రజానీకానికి గర్వకారణమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ద్రౌపతి ముర్ము రాక సందర్భంగా విజయవాడలోని గేట్ వే హోటల్ లో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం ఆత్మీయ సమావేశానికి ఏర్పాటుచేశారు. ద్రౌపది ముర్ముకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు, టిడిఎల్ పి ఉపనేత నిమ్మల రామానాయుడు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఒరిస్సాలోని మారుమూల పల్లెలో జన్మించిన ముర్ము అట్టడుగున ఉన్న ఆదివాసీల సంక్షేమం కోసం ఎనలేని కృషిచేశారని కొనియాడారు. ఒక సాధారణ పౌరురాలు రాష్ట్రపతి స్థాయికి ఎదగడం భారత రాజ్యాంగ విశిష్టత… ముర్ము మనపక్క రాష్ట్రమైన ఒరిస్సాకు చెందిన వారు కావడం మనందరి అదృష్టం. నేటి సమాజంలో అన్నిబంధనాలను ఎదుర్కొని గిరిజనులు, ఆదివాసీలు అత్యున్నతస్థాయికి చేరుకోవడం అరుదు. ఈ క్రమంలో ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో సామాజిక న్యాయం కోసం టీడీపీ ఆమెకు మద్ధతివ్వాలని నిర్ణయించిందని చంద్రబాబునాయుడు తెలిపారు. రాజకీయాల్లో నేను నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం వచ్చిన సందర్భాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కే.ఆర్.నారాయణ్ ను , మైనార్టీ వర్గానికిచెందిన అబ్దుల్ కలాం లను రాష్ట్రపతిగా ఎంపిక చేశాం. ఆ తర్వాత రామ్ నాథ్ కోవింద్ ను బలపర్చాం, ఇప్పుడు ద్రౌపది ముర్ములకు మద్దతు ఇస్తున్నాం…ఈ నలుగురిలో ఇద్దరు ఎస్సీ, ఒక మైనారిటీ, ఒక ఎస్టీని ఎంపిక చేయడంలో తాము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నా. ద్రౌపదిముర్మును ఎంపిక చేసిన ప్రధాని నరేంద్రమోడీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గ్రామ స్థాయి నుండి అంచలంచెలుగా ఎదిగిన ముర్ము… కౌన్సిలర్‌గా, మున్సిపల్ చైర్మన్ గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా పని చేసిన ఏకైక ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము. ముర్మును ఎంపిక చేసి దేశంలో సామాజిక న్యాయం చేసే అవకాశం వచ్చినందువల్ల టీడీపీ కూడా బాధ్యతగా వ్యవహరించి మద్ధతు తెలపాలని నిర్ణయించాం. ముర్ము ఎన్నిక కోసం టీడీపీ తరపును పూర్తి సహకారం అందిస్తాం. రాష్ట్రం నుండి రాష్ట్రపతికి ఏకగ్రీవంగా మద్ధతు తెలపడం సంతోషంగా ఉంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సోదరిగా నన్ను బలపర్చిన టిడిపికి కృతజ్జతలు
ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము మాట్లాడుతూ…ఓ సోదరిగా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన టీడీపీకి కృతజ్ఞతలు…. ఏపీతో ఒడిశాకు ఎన్నో సారుప్యతలు ఉన్నాయి…దేశ అత్యున్నత పదవి అధిష్టించేందుకు అంతా సహకరించాలని అన్నారు.
సామాజిక బాధ్యతగల నేత చంద్రబాబు: కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… తెలుగురాష్ట్రాల్లో సామాజిక బాధ్యత గల వ్యక్తి చంద్రబాబు, అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతిగా ఎన్నుకోవడంలో ఆయనది కీలక పాత్ర అని కొనియాడారు. ముర్ముకు మద్దతిచ్చిన చంద్రబాబుకు, టిడిపికి ధన్యావాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా 42 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతున్నాయని అన్నారు.
సామాజిక న్యాయానికి కట్టుబడిన టిడిపి: అచ్చెన్నాయుడు
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… ఒక ఆదివాసీ ,గిరిజన మహిళ అందులోనూ తమ జిల్లాకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి చెందిన దౌపతి ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అన్న ఎన్టీఆర్ మొదలుకొని చంద్రబాబు వరకు సామాజిక న్యాయానికి కట్టుబడి దేశ రాజకీయాల్లో ఎందరికో సముచిత స్థానం కల్పించడంలో కీలకపాత్ర పోషించారు. ద్రౌపతి ముర్ము నాయకత్వంలో దేశం మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
ముర్ము ఎంపిక అభినందనీయం: కేశినేని
ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ… ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము మన రాష్ట్రానికి రావడం ఆనందదాయకమన్నారు. సామాజిక స్పృహ ఉన్న కుటుంబం నుంచి ముర్ము వచ్చారు. ఆమె తండ్రి , తాతగారు గ్రామ సర్పంచ్‌లుగా పనిచేశారు. ముర్ము టీచర్‌గా, ప్రొఫెసర్‌గా, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా, సర్పంచ్‌గా, మంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు.రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము గారిని ప్రధాని మోదీ ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు.