రేపల్లె: అఖండ మెజార్టీతో గెలిపించిన రేపల్లె నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ సందర్బంగా బాపట్ల జిల్లా రేపల్లెలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిరదని మంత్రి అన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. జగన్ తనపై ఉన్న కేసుల కోసమే కేంద్రం చుట్టూ తిరిగారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు అన్యాయం జరిగిందని, వైసీపీ నేతల స్వంత ప్రయోజనాల కోసం కొన్ని పాలసీలు తీసుకొచ్చారన్నారు. ప్రజా వ్యతిరేక పాలసీలపై అధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. రీసర్వే పేరుతో ప్రజలను మోసం చేశారని, విశాఖ సమీపంలోని భీమిలిలో విలువైన భూములను వైసీపీ నేతలు కొల్లగొట్టారన్నారు. జగన్ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రజలకు న్యాయం జరిగేలా తాము చూస్తామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పారు.