.మూడేళ్లలో మూడుసార్లుగా 3వేల కోట్ల భారం!
.తాజాగా ఛార్జీల పెంపుతో బాదుడు రూ.820 కోట్లు
.రెండు నెలల్లో రెండోసారి ఆర్టీసి చార్జీల బాదుడు
.డీజిల్ రేటు తగ్గినా ఈ బాదుడేంది తుగ్లక్ రెడ్డీ?
.డీజిల్ సెస్సు పేరుతో 10నుంచి 140వరకు వడ్డన
.ఆర్టీసి ఛార్జీల మోత… రాష్ట్రప్రజలకు వాత!
.జగనన్న లేకపోయినా జనానికి తప్పని షాకులు
కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో లాక్కోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి… ఆర్టీసి చార్జీల పెంపుతో మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. ఎన్నికల సమయంలో బాదుడే బాదుడంటూ దీర్ఘాలు తీసి జనాన్ని మాయమాటలతో వంచనచేసి అధికారం చేపట్టిన నయా తుగ్లక్ జగన్ రెడ్డి నిజస్వరూపం చూడటానికి రాష్ట్రప్రజలకు ఎంతో సమయం ఇవ్వలేదు. సంక్షేమ పథకాల సాకుతో అడ్డగోలుగా భారాలు మోపుతూ జనానికి చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా డీజిల్ సెస్సు పేరుతో రూ.820 కోట్లరూపాయల ఆర్టీసి చార్జీల భారాన్ని రాష్ట్రప్రజలపై మోపాడు. ఈ ఏడాది ఏప్రిల్ 13వతేదీన ఇదే డీజిల్ సెస్సు పేరుతో 1500 కోట్ల రూపాయల భారాన్ని మోపిన తుగ్లక్ రెడ్డి… కేవలం రెండునెలల్లో మళ్లీ డీజిల్ సెస్సు అంటూ మరోమారు 820 కోట్లరూపాయల భారం మోపాడు. మూడేళ్లలో మూడుసార్లు ఆర్టీసి చార్జీలు పెంచిన ముఖ్యమంత్రిగా కూడా జగన్ రెడ్డి రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 13వతేదీన డీజిల్ సెస్సు పేరుతో ఆర్టీసి చార్జీలు వడ్డించిన తర్వాత గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీజిల్ పై 8రూపాయల భారం తగ్గించింది. ఏప్రిల్‌లో చార్జీలు పెంచే సమయంలో ఆర్టీసి చైర్మన్, జగన్ రెడ్డి సమీప బంధువైన మల్లిఖార్జున రెడ్డి మాట్లాడుతూ… ఆర్టీసి సంస్థ బల్క్ లో లీటరకు 131 రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, ఇకపై తాము రిటైల్ గానే కొనుగోలుచేసి ఆర్టీసిపై భారం తగ్గిస్తామని సెలవిచ్చారు. ఏప్రిల్ 13న డీజిల్ రేటు 107.45 రూపాయలుగా ఉండగా, ప్రస్తుతం రూ.99.45 పైసలకు తగ్గింది. బస్సులు నడపడానికి మూల ఇంధనమైన డీజిల్ రేటు తగ్గితే ఆర్టీసి చార్జీలు తగ్గించాల్సి ఉండగా… తుగ్లక్ రెడ్డి పాలనలో మాత్రం డీజిల్ రేట్లు తగ్గినా ప్రయాణీకులపై సెస్సు పేరుతో భారం విధిస్తారు. అధికారం చేపట్టినప్పటి నుంచి రివర్స్ పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి జనానికి ఇలాంటి షాకులు ఇవ్వడం కొత్తేమీ కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పేమాటలకు, చేసేపనులకు ఏమాత్రం పొంతన
ఉండదని తాజా ఆర్టీసి చార్జీల పెంపుతో మరోమారు స్పష్టమైంది. విద్యుత్ చార్జీల పెంపు, ఇంటిపన్ను, చెత్తపన్ను, ఖాళీస్థలాలపై పన్ను, క్రమబద్దీకరణ పేరుతో టాక్స్, ఎవరో కట్టిన పక్కాఇళ్లపై కూడా ఒటిఎస్ పేరుతో వసూళ్లకు దిగిన జగన్ రెడ్డి బాదుడు రాబోయే రోజుల్లో రోజుల్లో ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందోనని జనం భయంతో వణికిపోతున్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా నయాతుగ్లక్‌ను వదిలించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే రెండుసార్లు పెంపు
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండుసార్లు ఆర్టీసీ చార్జీల పెంపుతో రూ. 2,175 కోట్లు ప్రజలపై భారం మోపగా, తాజాగా మరో రూ.820 కోట్లు వడ్డించారు. గతంలో అత్యంత తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు ప్రజలను చేరవేస్తూ ప్రసంసలు పొందిన ఆర్టీసీ ఛార్జీలకు రెక్కలు రావడంతో సామాన్యుడికి భారంలా మారాయి. రాష్ట్రంలో 25 జిల్లాల్లో 3,803 మార్గాల్లో 1,11,763 బస్సులు నడుపుతూ 65 లక్షల మంది ప్రయాణికులను రోజూ గమ్యస్థానాలకు ఆర్టీసీ చేరవేస్తోంది. ఒకప్పుడు ప్రజాసేవకే పరిమితమైన ఆర్టీసీ సంస్థ నేడు ప్రజల జేబులకు చిల్లుపెట్టి దోచుకునే సంస్థగా మారిపోయింది.
ఆర్టీసి చార్జీలు ఎంత పెరిగాయంటే…!
కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకొని సాధారణ పరిస్థితులు నెలకొంటుతున్న తరుణంలో ఆర్టీసి చార్జీల పెంపు ప్రయాణీకులపై గోరుచుట్టుపై రోకటిపోటులా పరిణమించనుంది. పెరిగిన చార్జీలు శుక్రవారం నుంచే అమలులోకి వస్తాయని ఆర్టీసి వర్గాలు తెలిపాయి. డీజిల్ సెస్ పేరుతో ఇప్పటివరకు టికెట్ పై కనిష్టంగా రూ.5, గరిష్టంగా రూ.10 రూపాయలు వడ్డిస్తున్న జగన్ రెడ్డి సర్కారు… ఇకపై ప్రయాణదూరం ఆధారంగా డీజిల్ సెస్ వసూలు చేయాలని నిర్ణయించింది. తాజాగా పెంచిన చార్జీలతో దూరాన్ని బట్టి కనిష్ఠంగా రూ.10, గరిష్టంగా రూ.140 రూపాయల వరకు ఆయా సర్వీసుల్లో ప్రయాణీకులపై భారం పడనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి మొత్తం ఆర్టీసీ చార్జీలను నిర్ణయించారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగుల్లో 35 కిలోమీటర్ల లోపు మిగిలిన అన్ని ఆర్టీసి బస్సుల్లో ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. దూర ప్రాంత, ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీలను భారీగా పెంచారు. పల్లెవెలుగు బస్సుల్లో 35 కి.మీ దాటాక పల్లెవెలుగు బస్సుల్లో కనిష్ఠంగా రూ.5, గరిష్ఠంగా రూ.20 వరకు డీజిల్ సెస్ వసూలుచేస్తారు.
అల్ట్రా డీలక్స్ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.25గా
ఉంటుంది. అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కిలోమీటర్‌కు రూ.1.55గా నిర్ణయించారు. అల్ట్రా డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్ఠంగా రూ.5, గరిష్టంగా రూ.120 మేర సెస్సు పేరుతో భారం పడనుంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు రూ.1.62 చొప్పున ఛార్జీలు పెంచిన సర్కారు…సూపర్ లగ్జరీ బస్సుల్లో డీజిల్ సెస్ గరిష్ఠంగా రూ.120 వరకు పెంచారు. ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ. 50గా నిర్ణయించగా, ఇంద్ర బస్సుల్లో కిలోమీటర్‌కు రూ.1.96 చొప్పున వసూలు చేస్తారు. ఇంద్ర బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్ఠంగా రూ.10 గరిష్ఠంగా రూ.140 రూపాయలు భారం పడనుంది. గరుడ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50 గా ఉండగా.. కిలోమీటర్ కు రూ.2.21 ఛార్జీగా నిర్ణయించారు. గరుడ బస్సుల్లో డీజిల్ సెస్ గరిష్ఠంగా రూ.140 రూపాయలు భారం పడనుంది. మెట్రో లగ్జరీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50 కాగా, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఛార్జీ కిలోమీటర్‌కు రూ.2.21 చొప్పున డీజిల్ సెస్ గరిష్ఠంగా రూ.140 భారం మోపనున్నారు. అమరావతి ఏసీ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ. 50 రూపాయలుగా నిర్ణయించగా, అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ కిలోమీటర్ కు రూ.2.49గా వసూలు చేయాలని నిర్ణయించారు. అమరావతి ఏసీ బస్సుల్లో డీజిల్ సెస్ గరిష్టంగా రూ.140 రూపాయల అదనపు భారం పడనుంది. డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లో ఇకపై కనీస చార్జీ రూ.50 కాగా, ఆ బస్సుల్లో ఛార్జీ కిలోమీటర్‌కు రూ.2.49గా నిర్ణయించారు. డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.140 వడ్డించనున్నారు. నైట్ రైడర్ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.50 రూపాయలు కాగా,
ఆ బస్సుల్లో ఛార్జీ కిలోమీటర్‌కు రూ.2.21గా నిర్ణయించారు. నైట్ రైడర్ బస్సుల్లో డీజిల్ సెస్ గరిష్ఠంగా 140 వసూలు చేస్తారు. నైట్ రైడర్ బెర్త్ బస్సుల్లో డిజిల్ సెస్‌తో కలిపి కిలోమీటర్‌కు రూ.2.60 ఛార్జీ వసూలుచేస్తారు. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఇకపై కనీస ఛార్జీ రూ.80, వెన్నెల 24 బెర్తుల బస్సుల్లో కిలోమీటర్ కు రూ.3.03 ఛార్జీ వసూలు చేస్తారు. వెన్నెల బస్సుల్లో డీజిల్ సెస్ గరిష్టంగా 140 వసూలు చేస్తారు. తిరుపతి-తిరుమల మధ్య తిరిగే బస్సుల్లో ఛార్జీలను కూడా ఆర్టీసి భారీగానే పెంచింది. తిరుపతి- తిరుమల బస్సుల్లో టికెట్ ధర రూ.75 నుంచి రూ.90కి పెంచారు. తిరుపతి-తిరుమలకు రానుపోను టికెట్ ధర రూ.135 నుంచి రూ.160కి పెంచారు.