శ్రీకాకుళం: రైతుల పట్ల జగన్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. మంగళవారం శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…రైతులు పంటలు ఎండి కన్నీరు కారుస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి ఒక్కరూ కూడా రైతు సమస్యలపై స్పందించడం లేదు. వర్షపాతం తక్కువ ఉంటుందని ముందునుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వచ్చినా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదు. టీడీపీ హయాంలో పంట నష్ట పోకుండా రైన్ గన్స్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం కరువు మండలాలను కూడా ప్రకటించ లేదు. రైతును దగా చేస్తున్నారు తప్ప.. ఆదుకోవడంలేదు. పంట ఎండి నాశనమై పోతున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రమంతా తీవ్ర దుర్భిక్షం ఉన్నా కేవలం 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. పంటలు ఎండిపోతుంటే ఇరిగేషన్, వ్యవసాయ మినిష్టర్లు ఏం చేస్తున్నారు. ఇరిగేషన్ మినిష్టర్.. రైతులపాలిట ఇరిటేషన్ మినిష్టర్‌గా మారారు. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క కాలువ కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. కాలువల్లో పిడికెడు మట్టి కూడా పూడిక తీయలేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
వైసీపీ నేతలకు యాత్రలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు
టీడీపీని, చంద్రబాబుని తిట్టడం తప్ప.. మంత్రులు ప్రజల గురించి ఆలోచించడం లేదు. వైసీపీ నేతలు బస్సు యాత్ర ఏందుకు చేస్తున్నారు. యాత్రల్లో కనీసం రైతులు గురించి మాట్లాడటం లేదు. ప్రచార ఆర్బాటాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద పట్టడం లేదు. జెండపట్టుకుని వెళ్తే చెప్పుతో కొట్టే పరిస్థితి ఉండటంతో అధికారులను ముందు పెట్టుకుని వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. సీఎం జగన్ ఈ నెల 23వ తేదీన జిల్లాకు వస్తున్నారు.. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాకే ఇక్కడ అడుగుపెట్టాలి. ఇద్దరు మంత్రులు జిల్లాలో ఉన్నా కనీసం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాలి. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు ఏ విధంగా పెట్టించాలనే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేయడం లేదు. నేటికి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ ఆధారాలు చూపించలేకపోతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు.