- వైసీపీ నిర్వీర్యం చేసిన ప్రాజెక్టులకు జవసత్వాలు
- 2014-19లో ప్రతిపాదిత ఎయిర్ పోర్టుల పూర్తికి నిర్ణయం
- రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు
- కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, మూలపేటల్లో నిర్మాణం
- ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌పైనా దృష్టి పెట్టండి
- అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై సీపం సమీక్ష
అమరావతి (చైతన్య రథం): 2014 -19మధ్య కాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభిస్తే వాటన్నింటినీ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దుచేసిన, నిలిపేసిన అన్ని ప్రాజెక్టులనూ మళ్లీ పట్టాలెక్కించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలు- పెట్టుబడుల శాఖపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిలిపివేసి సంపద సృష్టి కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, మళ్లీ ఆ ప్రాజెక్టులు గాడిన పెట్టి త్వరితగతిన పూర్తి చెయ్యాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు, ఏపీ మారిటైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మె,ట్ కార్పొరేషన్, వివిధ ప్రాజెక్టుల్లో స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఏపీ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు.
వివాదాలకు తావులేకుండా అన్ని పోర్టులు, ఫిషింగ్‌హార్బర్లు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఏపీ మారిటైం మాస్టర్ ప్లాన్‌తోపాటు మారిటైం పాలసీ తీసుకువస్తామన్నారు. నాడు సుదీర్ఘ కసరత్తు చేసి తలపెట్టిన ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో నాడు ప్రతిపాదించిన నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పం, పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లలో ఎయిర్ పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌ల నిర్మాణంతో పాటు శ్రీకాకుళం జిల్లా మూలపేట ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టాలన్నారు. గతంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేయడంతోపాటు భూసేకరణ కూడా పూర్తైందని, అయితే గత ప్రభుత్వం వీటిని నిలిపివేసిందని సీఎం అన్నారు. మళ్లీ ఈ`ఎయిర్ పోర్టుల నిర్మాణం కార్యరూపం దాల్చాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 12నుంచి 14చోట్ల ఎయిర్ పోర్టులు, ఎయిర్ స్ట్రిప్‌లు అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా వివరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో కూడా ఎయిర్ పోర్టులు/ ఎయిర్‌స్ట్రిప్‌లు నిర్మించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే కర్నూలు ఎయిర్‌పోర్టులో ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేష్వంటి సంస్థలను తీసుకురావాలన్నారు. ఎయిర్‌పోర్టుల ద్వారా సరుకు రవాణా చేసేలా ప్రాజెక్టులు రూపకల్పన చేయాలని సీఎం అన్నారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, నేషనల్ హైవేలు అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగ కల్పనతోపాటు వేగవంతమైన అభివృద్ధి సాధించవచ్చని సీఎం అన్నారు.
ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌ను జిఎడి పరిథిలోకి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను ఐ అండ్ పిఆర్ పరిథిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఏపీ టవర్స్ కార్పొరేషన్‌ను ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో విలీనం చేయాలన్నారు. ఒక మంచి లక్ష్యంతో నాడు ఏపీ ఫైబర్‌నెట్ ప్రాజెక్టును తీసుకొస్తే దానిపైనా విషంచిమ్మి బంగారంలాంటి ప్రాజెక్టును నాశనం చేశారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కరెంట్ స్థంభాల ద్వారా ఫైబర్‌నెట్ ఏర్పాటు చేసి కేవలం 10శాతం ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. 24 వేల కిలోమీటర్లమేర ఫైబర్‌నెట్ నిర్మాణం చేసి 9 లక్షల కనెక్షన్లు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వ రివర్స్, అసమర్థ పాలనవల్ల 9 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు 5 లక్షలకు పడిపోయాయని… వాటిలో కూడా నాణ్యమైన సేవలు అందించలేదని సీపం అన్నారు.
నాడు నెలకు రూ.149కే సెట్ టాప్ బాక్సుల ద్వారా ఇంటర్నెట్, కేబుల్ టీవీ ప్రసారాలు అందిస్తే, వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రూ.1258 కోట్ల అప్పుల్లోకి నెట్టేసిందన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్, ఏపీ టవర్స్ కార్పొరేషన్, గ్యాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లను కూడా మళ్లీ గాడిలోపెట్టి సేవలు పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాడు జిల్లాల్లో నిర్మాణం తలపెట్టిన ఆర్టీజీ సెంటర్లు పూర్తిచేయాలని సూచించారు. సీసీ కెమెరా నెట్‌వర్క్‌ను వీటికి అనుసంధానించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.