విజయనగరం: విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. భోగాపురం నుంచి సుమారు 55కిలోమీటర్ల పాటు సాగిన రోడ్ షోకు జనం దారిపొడవునా నీరాజనాలు పలికారు. భోగాపురం సన్ రే రిసార్ట్స్ నుంచి ప్రారంభమైన చంద్రబాబు కాన్వాయ్ భోగాపురం, నాతవలస, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల మీదుగా చీపురుపల్లి వరకు సాగింది. చిన్నపిల్లల నుంచి వృద్ధులవరకు జనం పూలుచల్లుతూ, హారతులు పలుకుతూ కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. దాదాపు అయిదుకిలోమీటర్ల పైగా వాహనశ్రేణి చంద్రబాబును అనుసరించారు. యువకులు మోటారుసైకిళ్లపై కాన్వాయ్ ను అనుసరిస్తూ జయహో చంద్రన్నా అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడుకు ఊహించనిరీతిలో జనం పోటెత్తగా… అంతకుమించి విజయనగరం ప్రజలనుంచి స్పందన లభించింది. ప్రజలు మిద్దెలు, మేడలపైన, హోర్డింగ్ లపై సైతం నిలబడి చంద్రన్నను చూసేందుకు ఎగబడ్డారు. ఊహించనిరీతిలో అధినేత పర్యటనకు లభిస్తున్న స్పందనను చూసి టిడిపి నేతలు ఉక్కిరిబిక్కరవుతున్నారు. 1983 తర్వాత ఇంతటి స్పందన ఇదివరకెన్నడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మార్పుకు ఎప్పుడూ ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం ఉంటుందని, పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనను చూస్తే రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చీపురుపల్లి పర్యటన ముగించుకుని విశాఖపట్నానికి వెళుతుండగా చీపురుపల్లి సమీపాన పురేయవలస వద్ద రోడ్డుపై బైక్ ప్రమాదం జరిగి ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలానికి చెందిన ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటునుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న చంద్రబాబు ఇది గమనించి కాన్వాయ్ ను ఆపి బాధిత కార్యకర్తలను పరామర్శించారు. వెంటనే అంబులెన్స్ పిలిపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలుగుదేశం నాయకులను ఆదేశించారు.