విశాఖపట్నం: విశాఖ నగరం, శివార్లలో వైసిపి నేతల ధనదాహం తారాస్థాయికి చేరింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా గ్రావెల్ తవ్వకాలు సాగించడంతో విశాఖ జిల్లా పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో కొండ కుప్పకూలింది. కొండ కుప్పకూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొండ జారినప్పుడు ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. కొండ కూలడానికి అక్రమ క్వారీయింగే ప్రధాన కారణంగా ఉంది. గతంలోనూ కొండ వద్ద అక్రమ క్వారీయింగ్పై్ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అక్రమ క్వారీయింగ్ జరిగినట్లు నిర్ధారణ అయి కొంతకాలం క్వారీయింగ్ నిలిపివేశారు. స్థానికులు వద్దంటున్నా వినకుండా వైసిపి నేతలు మళ్లీ క్వారీయింగ్ ప్రారంభించారు. దొంగలుపడి వెళ్లాక కుక్కలు మొరగినట్లు కొండ కుప్పకూలడంపై పెందుర్తి తహశీల్దార్ తాపీగా స్పందిస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని సెలవిచ్చారు.
ఇది జగన్ రెడ్డి మేడ్ డిజాస్టర్: లోకేష్
ఇది ప్రకృతి విపత్తు కాదు… జగన్ మేడ్ డిజాస్టర్ అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో వైసీపీ మైనింగ్ మాఫియా అడ్డగోలు తవ్వకాలతో కొండ జారీపోయిందని, ప్రకృతితో పెట్టుకుంటే ఏమవుతుందో జగన్ రెడ్డికి బాగా తెలిసినా మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడని దుయ్యబట్టారు.