అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్నఘటనలు ప్రభుత్వ దుర్మార్గాన్ని చాటి చెపుతున్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో సచివాలయ ఉద్యోగి వాసుదేవరావుపై సర్పంచ్ భర్త గున్నయ్య దాడిని ఖండించారు. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రిని సమస్యలపై ప్రశ్నించారని కవిత అనే మహిళ ఇంటికి కరెంట్ తొలగించి పాలు, నీళ్లు కూడా అందకుండా చేయడం దుర్మార్గ చర్య అన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ అహంకారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. ఉద్యోగులు, ప్రజల పట్ల వైసిపి గూండాలు వ్యవహరించిన తీరు ఒకటైతే…దాన్ని సమర్థించిన ప్రభుత్వం తీరు మరింత విస్తుగొలుపుతుందన్నారు. పోయేకాలం దాపురించి కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్న వైసిపి రాక్షసులు వీటన్నింటికీ ఎప్పటికైనా మూల్యం చెల్లించుకుంటారని మండ్డిపడ్డారు. సిగ్గున్న ప్రభుత్వం అయితే శ్రీకాకుళంలో దివ్యాంగ ఉద్యోగిపై దాడి, ప్రకాశం జిల్లాలో మహిళపై వేధింపులకు తలదించుకోవాలన్నారు. వెంటనే వైసీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులను క్షమాపణ కోరాలన్నారు. ప్రజలు మీ ప్రభుత్వ ప్రతి వికృత పోకడను గమనిస్తున్నారనేది తెలుసుకోవాలన్నారు.