- బ్రహ్మోత్సవాలకు ముందే పవిత్రయాగం
- ఆగమ సలహాదారుల సూచన తీసుకున్నాం
- నేడు తిరుమలలో పంచగవ్య ప్రోక్షణం
- లడ్డూ కల్తీపై ప్రజల గుండెమండిరది..
- అపచార పరిహారంపై ముఖ్యమంత్రి ప్రకటన
- తిరుమల కేంద్రంగా వైసీపీ దారుణాలు
- రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు
- అన్యమతస్థులు చైర్మన్లయ్యారు…
- భక్తుల మనోభావాలకు వాళ్లు విలువివ్వలేదు
- ప్రాయశ్చిత్తం చేసుకోకుండా వెకిలి మాటలా?
- దాణా సరిగాలేక నెయ్యి కల్తీ అయ్యిందట..
- వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ‘గత పాలకులు అహంభావంతో తిరుమల పవిత్రను దెబ్బతీశారు. వారి మహాపరాధానికి అందరం క్షోభ అనుభవిస్తున్నాం. శ్రీవారి సన్నిధిని శుద్ధిచేసి శాంతిహోమంతో మళ్లీ పవిత్రత ఆపాదిస్తాం. జరిగిన తప్పులకు స్వామిని క్షమాపణ వేడుకుంటూ బ్రహ్మోత్సాలకు ముందే పవిత్రయాగం చేస్తాం. ఆగమ సలహా మండలి సభ్యులు సూచన మేరకు సోమవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలో శాంతిహోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహిస్తారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైసీపీ హయాంలో పునరావాస కేంద్రంగా తిరుమల
‘కోట్లాది హిందూ భక్తులంతా పవిత్రంగా భావించే మహా పుణ్యక్షేత్రం తిరుమల. ఏడు కొండలవాడిని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పారవశ్యంగా పిలచుకుంటారు. తిరుమలకు వచ్చి కలియుగదైవాన్ని దర్శించుకుంటే పాపహరణ జరుగుతుందని, బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాంటి పవిత్ర దేవాలయ ప్రతిష్టను గత పాలకులు దెబ్బతీశార’ని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ‘ఎన్టీఆర్ వైకుంఠ కాంప్లెక్స్ 1 కడితే, నేను కాంప్లెక్స్-2 కట్టాను. ఎన్టీఆర్ అన్నదానం పెడితే… నేను ప్రాణదానం తీసుకొచ్చాను. అన్నదాన కార్యక్రమం ద్వారా ఎంతమందికైనా భోజనం పెట్టొచ్చు. దానికి కార్పస్‌ఫండ్ కూడా రూ.2 వేల కోట్లు ఉంది. ప్రాణదానంలో కూడా కార్పస్‌ఫండ్ పెరుగుతోంది. దీన్ని 2003లో స్విమ్స్‌లో ప్రారంభించాం’ అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తున్న సమయంలో 23 క్లేమోర్ మైన్స్ పెట్టారు. అప్పుడు ప్రాణభిక్ష పెట్టి స్వామి నాకు పునర్జన్మనిచ్చారు. నేను ఏ పని చేసినా వేంకటేశ్వరుడిని తలచుకుని చేస్తా’నని తన విశ్వాసాన్ని చంద్రబాబు చెప్పుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అన్నప్పుడు నేను పోరాడానని గుర్తు చేసుకుంటూ.. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో గత ఐదేళ్లూ అపవిత్ర కార్యక్రమాలకు పాల్పడ్డారని, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వలేదని, ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, జరిగిన తప్పులపై గత ఐదేళ్లలో ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేసినా పట్టించుకోలేదని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.
విశ్వాసం లేనివాళ్లను చైర్మన్లు చేశారు
‘సీఎంగా కాదు భక్తుడిగా చెప్తున్నా. వెంకటేశ్వరస్వామి ప్రసాదానికి ప్రత్యేకత ఉంటుంది. 300 ఏళ్లుగా లడ్డు తయారు చేసే విధానం, అందులో వాడే పోషకాలు నాణ్యతగా ఉంటాయి. సరుకులు సరఫరా చేసే వాళ్లు సైతం పవిత్రంగా భావిస్తారు. ఇంట్లోకి లడ్డు తెచ్చి పెడితే ఇల్లంతా సువాసన వస్తుంది. వడ, పొంగలి ప్రసాదాలు దేనికదే ప్రత్యేకత. శ్రీవారి లడ్డూకు చాలా డిమాండ్. 40 గ్రాముల ఆవునెయ్యి, 40 గ్రాముల శనగపిండి, ఇతర దినుసులు వినియోగించి 110 గ్రాముల లడ్డు తయారుచేస్తారు. 2009లో పేటెంట్ రైట్ సైతం దక్కింది. అలాంటి ప్రత్యేక లడ్డూను గత పాలకులు అధికారంలోకి రాగానే ఇష్టానుసారం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు నియామకాల్లో గ్యాంబ్లింగ్‌కు పాల్పడ్డారని, చట్టాన్ని మార్చి 50మంది నామినేటెడ్ పోస్టులు తీసుకొచ్చి రాజకీయ పునరావాస కేంద్రం చేశారన్నారు. ఎక్స్ అఫిషియో అనే విధానాన్ని తెచ్చి పెట్టిన దుర్మార్గులు, టీటీడీ టికెట్లు ఇష్టానుసారం అమ్ముకున్నారన్నారు. దేవదేవుడిపై నమ్మకంలేని వాళ్లను బోర్డు ఛైర్మన్లుగా పెట్టి.. అన్యమతస్తులకు ప్రాధాన్యమిచ్చారు. రాజకీయ ప్రయోజనాలకు టీటీడీని వాడుకున్నారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రాయశ్చిత్తం పడకుండా వెకిలి మాటలా?
గత పాలకుల హయాంలో జరిగిన అపచారాలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష బూనారని సీఎం చంద్రబాబు అన్నారు. దేవదేవుడికి అపచారం జరిగిందని ప్రపంచమంతా బాధపడుతుంటే.. వెకిలి వేషాలేస్తున్నారని, వాళ్ల ప్రవర్తన చూస్తే మనిషి పుట్టుక పుట్టారా? అనిపిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని, ఇన్ని తప్పులు చేసి ప్రధానికి లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. హిందువులంతా మండిపడుతుంటే.. అసత్యాలతో లేఖ రాసి జగన్ ఎదురు దాడికి దిగడాన్ని ఎద్దేవా చేశారు. ‘కేంద్రమంత్రి రికమెండేషన్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల రికమెండేషన్‌తో టీటీడీ బోర్డు మెంబర్లు నియమించామని లేఖలో రాశారు. బోర్డు మెంబర్లు ఏం చేయగలుగుతారు.? మీ హయాంలో టీటీడీ ఈఓ ఎవరు.. ఎక్కడినుండి వచ్చారు?’ అని ప్రశ్నించారు.
ఇంట్లో ఎవరైనా చనిపోతే యేడాదిదాకా తిరుమలకు వెళ్లరని, వెళ్తే అపచారంగా భావిస్తామని గుర్తుచేస్తూ.. ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన 12వ రోజే తిరుమలకు రావడాన్ని ఏమనాలని నిలదీశారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం తిరుపతి వచ్చినప్పుడు నమ్మకంతో వచ్చామని చెప్పారు. వాళ్లకంటే జగన్ గొప్పోడా? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు.? టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబుల్ పట్టుకుని మాట్లాడతారు. భూమన కరుణాకర్‌రెడ్డి కూతరు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో చేశారు. అలాంటివాళ్లు చైర్మన్‌గిరీ ఎలా వెలగబెడతారు? అని ప్రశ్నించారు. తానూ జెరూసలెం వెళ్లానని, అక్కడి సాంప్రదాయాలు పాటించానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కేరళ గురువాయర్‌కు చొక్కాలేకుండా వెళ్లాలి. అది సాంప్రదాయం. ఒక్కో గుడికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది. ఒక్క టీటీడీ ఛైర్మన్ 3 లక్షల 75 వేల దర్శన లెటర్లు ఇచ్చారు. ఇవన్నీ చూసి షాక్ అయ్యా. విధ్వంసానికి నాంది పలికి మళ్లీ మాది చిన్న పాత్రేనని చెప్తున్నారు. అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయాలంటే ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్ ఉన్న ల్యాబ్‌కు వెళ్లాలి. కానీ గత ఐదేళ్లూ అలాంటి టెస్టులు లేవు. టెండర్ కండీషన్ ప్రకారం కల్తీ ఉందా లేదా? అనేది పరీక్ష చేయాలి. ఆ పరీక్షలకు అవసరమైన ల్యాంబ్‌కు కనీసం రూ.70 లక్షలు ఖర్చు చేయలేకపోయారు. ఇంత అపచారం చేసి కూడా పశ్చాత్తాప పడటం లేదు’ అని చంద్రబాబు వైసీపీ నేతలపై మండిపడ్డారు.
దాణా సరిగాలేక నెయ్యి కల్తీ అయ్యిందట
ప్రధానికి రాసిన లేఖలో కల్తీ నెయ్యికి వివరణ ఇస్తూ.. ఆవులు సరైన దాణా తినలేదు. గడ్డి సరిగా తినలేదు. అనారోగ్యంతో ఉన్న ఆవుల పాలతో తయారయ్యే నెయ్యి నాణ్యత లేకపోయే అవకాశం ఉందని పేర్కొనడం సిగ్గుచేటని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వీళ్లు చెబుతున్న అబద్ధాలకు సంఘ బహిష్కరణ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘15 వేల కేజీల నెయ్యి తయారీకి 3.75 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. 37 వేల ఆవులకు మంచి గడ్డి, దాణా ఇవ్వలేదు, దాని వల్ల నాణ్యత దెబ్బతింది అని చెప్తున్నాడు. కరుడుగట్టిన నేరస్తులకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. క్షమాపణ చెప్పకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అన్ని ఆవులకు అనారోగ్యం, దాణా సమస్య ఉందా? రామతీర్థంలో రాముడి తల నరికారు. అక్కడ పోరాటానికి వెళ్తే నాపై దాడి, కేసులు పెట్టారు. జగన్‌లాంటి వ్యక్తితో రాజకీయం చేయడం జాతికే అవమానం’ అని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు.