- ఆవు నెయ్యి స్వచ్ఛతకు జాగ్రత్తలు తీసుకున్నాం
- తితిదే ఈవో శ్యామలరావు వెల్లడి
- లడ్డూ ప్రసాదానికి తగ్గని డిమాండ్
- సీఎం చంద్రబాబుతో తితిదే అధికారుల భేటీ
- ఆలయ సంప్రోక్షణపై సుదీర్ఘ సమీక్ష
- డిప్యూటీ సీఎంకూ పరిస్థితి వివరించిన ఈవో
- లడ్డూ కల్తీపై కేంద్రంలోనూ చర్చ
- జగన్ నివాసం వద్ద జనం ఆగ్రహం
అమరావతి (చైతన్య రథం): తిరుమల తిరుపతి మహాప్రసాదానికి వినియోగించే ఆవు నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తితిదే ఈవో జె శ్యామలరావు వెల్లడిరచారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా భక్తులు ఆందోళనకు గురవుతున్నవేళ తాజా పరిస్థితిని ఈవో వివరించారు. ప్రస్తుతం నందిని, ఆల్ఫా ఫుడ్స్ నుంచి రూ.475కు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ రెండు సంస్థల నుంచి తీసుకుంటున్న ఆవు నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేస్తున్నట్టు వెల్లడిరచారు. ‘‘నెయ్యిలో కల్తీ జరిగిందని తేలడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నెయ్యి విషయంలో పొరపాట్లు జరగకుండా 18మందితో సెన్సరీ ప్యానల్ ఏర్పాటు చేశాం. మూడు నెలల్లో సెన్సరీ ల్యాబ్ కూడా పెట్టాం. ఎన్‌డీడీబీ ల్యాబ్ సహకారంతోనే పరికరాలు తీసుకువస్తున్నాం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పులు చేస్తున్నాం. దోషాల నివారణకు ఆగస్టు 15నుంచి 17వరకు పవిత్ర ఉత్సవాలు నిర్వహించాం. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు’’ అని ఈవో జె శ్యామల రావు విజ్ఞప్తి చేశారు.
ఇదిలావుంటే `తిరుమల శ్రీవారి లడ్డూకు భారీగా డిమాండ్ పెరిగినట్టే కనిపిస్తోంది. లడ్డూను చుట్టుముట్టిన వివాదాలతో విక్రయాలు తగ్గుతాయని భావించినప్పటికీ, అలాంటిదేమీ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు తయారయ్యాయన్న వివాదం చెలరేగినా.. ఎన్డీయే సర్కారు వచ్చిన దగ్గర్నుంచీ తిరుమల క్షేత్రంపై తీసుకున్న ప్రక్షాళన చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. దీంతో లడ్డూ విక్రయాలపై నెయ్యి వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదు. లడ్డూ తయారీలో తప్పిదాలు జరిగినా శ్రీవారి లడ్డూను పరమ పవిత్రంగా భావిస్తున్న భక్తులు ‘మహాప్రసాదాన్ని’ భారీగానే కొనుగోలు చేస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం ఈనెల 19న 3.59 లక్షల లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారి భక్తులు స్వీకరిస్తే.. 20న 3.16 లక్షలు, 21న 3.66 లక్షల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేశారు.
మరోపక్క కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. శ్రీవారికి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారుల 13 గంటలపాటు నిరంతరంగా తనిఖీలు సాగించారు.
అనంతరం పాల ఉత్పత్తుల శాంపిల్స్ అధికారులు సేకరించారు. మరోపక్క శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా గుంటూరు జిల్లాలోని నంబూరు ఆలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష ప్రారంభించారు. తిరుమల లడ్డూ అపవిత్రమైనందుకు క్షమించమని వేడుకుంటూ.. నంబూరు శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించారు. ఇంకొకపక్క తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తిస్థాయి విచారణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. టీటీడీ ఈవో శ్యామలరావు అందించిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. ప్రపంచస్థాయిలో ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని కఠినంగా వ్యవహరించాలని నిర్ణయంచింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో.. కల్తీ నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణకు ఆదేశించింది.
తొలుత తిరుమల లడ్డూ కల్తీపై తితిదే అధికారులతో సీఎం చంద్రబాబు ఆయన నివాసంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు, డిప్యూటీ ఈవో వెంకయ్యచౌదరి, ఉన్నతాధికారులతో సమావేశమై ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై తగు సూచనలను ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించినట్టు తెలుస్తోంది. అలాగే, అందుబాటులోవున్న మంత్రులతో ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై ఆరా తీసిన పవన్‌కల్యాణ్‌కు, గత పాలకమండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల వివరాలను పవన్‌కు ఈవో వివరించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాల్లో రాజీ వద్దని సూచించిన పవన్.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అయితే, తిరుమల లడ్డూ వివాదాన్ని కేంద్రం సైతం సీరియస్‌గా తీసుకుంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో, సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేయాలని రాష్ట్రాన్ని కోరనున్నట్టు చెబుతున్నారు.
జగన్ నివాసం వద్ద ఆగ్రహం
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ యువమోర్చా.. తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. జగన్ నివాసాన్ని ముట్టడిరచి, జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలుపుతూ, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.