తిరుమల (చైతన్య రథం): తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలిరోజైన శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు.. మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ కార్య నిర్వహణాధికారి శ్యామలరావు, అదనపు ఈఓ సిహెచ్ వెంకట చౌదరిలు ముఖ్యమంత్రి దంపతులకు ఘన స్వాగతం పలికారు. తొలుత ధ్వజ స్తంభానికి నమస్కరించి.. వెండి పళ్లెంలో నెత్తిన పెట్టుకుని తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించారు.
రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు సీఎం దంపతులను ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, వేంకటేశ్వరస్వామివారి కళంకారీ చిత్రపటాన్ని సీఎం దంపతులకు అందజేశారు. ముఖ్యమంత్రివెంట దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తితిదే ఈవో శ్యామలరావు, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, సివీఎస్వో శ్రీధర్, జెఈఓ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జెసి శుభంబన్సల్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య తదితరులున్నారు. గత ఐదేళ్లలో కనిపించని అద్భుత దృశ్యం.. ముఖ్యమంత్రి భార్యాసమేతంగా వచ్చి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడం చూసి భక్తులు మురిసిపోయారు.