.10 మందికి పదవులిచ్చి వేల మందిని చంపడం సామాజిక న్యాయమా?
.11,500 ఎకరాల ఎస్సీల అసైన్డ్ భూములు లాక్కోవడం సామాజిక న్యాయమా?
.మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు మళ్లింపు వాస్తవం కాదా?
.స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 10శాతం కోతపెట్టి 16,800 మందికి ద్రోహం.
.బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.26 వేల కోట్లు మళ్లించడం సామాజిక న్యాయమా?
.ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మూడేళ్లలో ఖర్చు చేసిందెంత?
.మన్యంలో చంద్రబాబు కాఫీతోటలు పెంచితే.. జగన్ గంజాయి తోటలు పెంచారు
.టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సామాజిక న్యాయ విద్రోహి అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. 56 కార్పొరేషన్లు, 10 మంత్రి పదవుల పేరుతో ప్లీనరీలో తీర్మానం పెట్టడం దారుణమన్నారు. కార్పొరేషన్లతో మూడేళ్లలో ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఎస్సీల అసైన్డ్ భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి హక్కుల్ని కాలరాసి.. ఎస్సీలను అణగదొక్కడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అన్ని రకాల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించడమేనా.. సామాజిక న్యాయం అని నిలదీశారు. 10 మందికి పదవులిచ్చి వేల మందిని హత్య చేయడం దారుణమన్నారు. మన్యంలో చంద్రబాబు కాఫీతోటలు పెంచితే.. జగన్ గంజాయి తోటలు పెంచారని ఎద్దేవా చేశారు. దళితులకు బొరుగులు పెట్టి.. వారి బంగారం కొట్టేయడం.. సామాజిక న్యాయమా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. వైసీపీ ప్లీనరీలో అన్ని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని పక్కదారి పట్టేంచేలా ప్రతిక్ష నేతల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఈ మేరకు ప్రతికా ప్రకటన విడుదల చేశారు. లేఖలో పేర్కొన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
బీసీ ద్రోహి జగన్ రెడ్డి :
56 కార్పొరేషన్లు, 10 మంత్రి పదవులు ఇచ్చామని అదే సామాజిక న్యాయమని వైసీపీ మోసపూరిత తీర్మానాలు చేస్తోంది. బీసీలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి రెండో వైపు 10శాతం రిజర్వేషన్లు కోత కోసి స్థానిక ఎన్నికల్లో 16,800 రాజ్యాంగ పదవుల్ని దూరం చేయడం సామాజిక న్యాయ విద్రోహం కాదా.? బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.26వేల కోట్లు దారి మళ్లించడం సామజిక న్యాయమా.? 56 కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం బీసీలను దగా చేయడం కాదా.? 10 మంత్రి పదవులిచ్చి వందలాది బీసీలను హత్య చేయడం సామాజిక న్యాయమా.?
దళితులకు నమ్మకద్రోహం :
సబ్ ప్లాన్ నిధులు రూ.7,200 కోట్లు దారి మళ్లించారు. 11,500 ఎకరాల దళితుల అసైన్డ్ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్య, కులాంతర వివాహాలకు ఆర్ధిక సాయం, పారిశ్రామిక రాయితీలు వంటి 28 ఎస్సీ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు రద్దు చేయడం దళికులకు నమ్మక ద్రోహం చేయడం కాదా.? ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ లాంటి అనేక మంది దళితుల్ని హత్య చేయడంసామాజిక న్యాయమా.?
గిరిజన వంచన :
ఎస్టీ సబ్ ప్లాన్ నుండి రూ.1000 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారు. 81 గురుకుల పాఠశాలలను సాధారణ పాఠశాలలుగా మరాచేందుకు కుట్ర చేశారు. జీవో నెం.3పై కనీసం తీర్మానం చేసి కేంద్రానికి పంపలేదు. చంద్రబాబు నాయుడు మన్యంలో కాఫీ తోటలు పెంచితే.. జగన్ రెడ్డి గంజాయి తోటలు పెంచారు. పోలవరం గిరిజనుల్ని వరదల్లో ముంచారు. ముంపు గిరిజనులకు పరిహారంలో మోసం చేయడం సామాజిక న్యాయమా.?
మైనార్టీలకు ధోకా :
మైనార్టీ సంక్షేమ నిధులు రూ.1,483 కోట్లు దారి మళ్లించారు. దుల్హన్, రంజాన్ తోఫా, దుకాన్ మకాన్ వంటి పథకాలు రద్దు చేశారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు హామీపై మాట తప్పి మడమ తిప్పారు. బీజేపీతో అక్రమ సంసారం చేస్తూ మైనార్టీలను మోసం చేశారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి సామూహిక ఆత్మహత్యకు కారణమయ్యారు. ఇదేనా సమాజిక న్యాయం.?
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన అసైన్డ్ భూముల్ని బలవంతంగా గుంజుకోవడం, పారిశ్రామిక రాయితీలు రద్దు చేయడం, నాణ్యమైన విద్యను దూరం చేయడం, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించడం, వందలాది మందిని హత్య చేయడం సమాజిక న్యాయమా.? దళిత, బహుజనులకు బొరుగులు పెట్టి వారి బంగారం కొట్టేయడం సామాజిక న్యాయమా.. మోసకారి తనమా.? అని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.