- మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
- తీవ్రంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు, స్వల్పగాయాలకు రూ.5లక్షలు
- చెల్లించేందుకు అంగీకరించిన యాజమాన్యం
- అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో బాయిలర్ పేలి ఒకరి మృతి
- 15 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) జోక్యంతో సిమెంటు కర్మాగారం ప్రమాద బాధితులకు మెరుగైన ఆర్థిక సాయం అందింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం బాయిలర్ పేలిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆవాల వెంకటేశ్ (35) మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలతో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ప్రమాదం విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఇప్పటికే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులు హాస్పటల్ వద్దనే పర్యవేక్షణ చేస్తున్నారని వారికి తెలిపారు.
మృతుని కుటుంబానికి ప్రభుత్వపరంగా.. కర్మాగారం నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కాగా సీఎంఓ ఆదేశాలతో ఇటు కంపెనీ యాజమాన్యం, అటు బాధిత కుటుంబాలతో కలెక్టర్ సృజన, జగ్గయ్యపేట ఎమ్మెల్యే చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి రరూ.50 లక్షలు పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు రూ.25 లక్షల పరిహారం, స్వల్ప గాయాల బాధితులకు రూ.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని, మృతుడి కుటుంబంలో ఒకరికి పరిశ్రమలో ఉద్యోగం కల్పిస్తామని చెప్పింది. ఎమ్మెల్యే రాజగోపాల్, కలెక్టర్ సృజన చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం పరిహారం చెక్కులు అందజేసింది.
సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడటంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. బూదవాడ ఘటనపై శాఖాపరమైన విచారణ చేయిస్తామని, నిర్వహణ లోపాలు ఉంటే కర్మాగారంపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన చెప్పారు.