రిమాండ్ పూర్తయినా ఎందుకు పిటిషన్ వేయలేదు?
నర హంతకుడిని అనంతబాబును కాపాడతారా?
అమరావతి: తన డ్రైవర్ సుబ్రమణ్యం అనే దళితుడ్ని హత్యచేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్ రాజు ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… హంతకుడైన అనంతబాబును కాపాడటమే జగన్ రెడ్డి విధానమా? అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ పూర్తైనా ఇప్పటి వరకు పిటీషన్ ఎందుకు దాఖలు చేయలేదు? వైసీపీ నుంచి మోసకారి సస్పెన్షన్ చేసి హంతకుడిని అన్ని విధాల కాపాడుతారా? జైల్లో హంతకుడిని పరామర్శించిన వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
అనంతబాబు ఒక హంతకుడు. దళిత వర్గాల వ్యతిరేకి. అనంతబాబును కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకే హత్య జరిగాక వారంరోజులపాటు అనంతబాబును దాచిపెట్టి అరెస్టు చేయలేదు. అనంతబాబు తప్పు చేయలేదు గనుకనే దర్జాగా ప్రజల్లో తిరుగుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ నిస్సిగ్గుగా సమర్ధించాడు. దళిత సంఘాలు, ప్రతిపక్షపార్టీలు ధర్నాలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టు చేసి డ్రైవర్ సుబ్రమణ్యం తిరగబడ్డాడని ఆత్మరక్షణ కోసం నెట్టాడనే కట్టుకథలు అల్లారు. ఇప్పుడు అనంతబాబుకు 14 రోజులు రిమాండ్ ముగిస్తున్నా కనీసం పిటీషన్ కూడా దాఖలు చేయలేదు. అంటే జగన్ రెడ్డి పార్టీ నుంచి అనంతబాబును సస్సెండ్ చేసింది కేవలం దళిత వర్గాలను శాంతింపచేయడానికే అని స్పష్టంగా అర్ధమౌతుంది. పరోక్షంగా అనంతబాబును బయటికి తీసుకురావడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోంది.
అనంతబాబుకు జైల్లో అన్ని రాచమర్యాదలు జరుగుతున్నాయి. ప్రత్యేక రూం, బెడ్, పుడ్ ఏర్పాట్లు చేశారు.14 రోజుల రిమాండ్ లో జైల్లో మరో ఖైదీపై అనంతబాబు దాడి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇప్పించాలని ముఖ్యమంత్రి వైస్ జగన్ రెడ్డి కనుసన్నల్లో వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మీ హంతకుడు అనంతబాబును జైలుకెళ్లి పరామర్శించిన ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ సస్పెండ్ చేసిన హంతకుడిని పార్టీ ఎమ్మెల్యే పరామర్శించడం అంటే మోసకారి సస్పెన్షన్ కాదా? హంతకుడి యోగక్షేమాలు తెలుసుకు రమ్మని ధనలక్ష్మిని జగన్ రెడ్డే పంపాడా? పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెబుతూ పార్టీ నుంచి అన్ని విధాల సహకరించడమే జగన్ రెడ్డి రివర్స్ విధానమా? గతంలో కూడా వంగవీటి మోహన రంగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయవాడకు చెందిన కబ్జాకోరు పూనూరి గౌతంరెడ్డి ని సస్పెండ్ చేసి తర్వాత ఎపిఎస్ఎఫ్ఎల్ చైర్మన్ ను చేశారు. ఇలాంటి మోసకారి సస్పెన్షన్లు చేసి దళితులను మోసం చేద్దామనుకున్నారా జగన్ రెడ్డీ? దళితులను చంపేసి, శవాన్ని ఇంటి వద్దకే పార్శిల్ చేసి తీసుకెళ్లి అప్పగించిన అనంతబాబుపై ఉత్తుత్తి చర్యలు తీసుకుంటున్న జగన్ రెడ్డిని దళితులు క్షమించరు. హంతకులకు జగన్ రెడ్డి అండగా నిలబడుతూ…..దళితులకు వెన్నుపోటు పొడుస్తున్నాడు. సంక్షేమం, సమన్యాయం, ఆర్థిక స్వావలంబన అంటూ మోసపూరిత మాటలు చెబుతూ.. దళిత, గిరిజన, బహుజనులను నిలువు దోపిడీ చేస్తున్న జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి. బెయిల్ ఇవ్వడానికి కేసులో తావులేదు. అనంతబాబుకు గనుక బెయిల్ వస్తే తీవ్ర స్థాయిలో దళితులు తమ నిరసన గళాలు విప్పాలని ఎం.ఎస్ రాజు పిలుపునిచ్చారు.