- నెహ్రూ, వాజ్‌పేయి రికార్డును సమం చేయనున్న మోదీ
- ఎన్డీయే కూటమిదే భారీ విజయమన్న ఎగ్జిట్ పోల్స్
- గత ఎన్నికలకు మించి ఈసారి ఫలితాలు
- ఎన్డీయేకు 350కి పైగా సీట్లు
- దక్షిణాదిన బీజేపీకి పెరగనున్న సీట్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయం దిశగా పయనిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమిదే భారీ విజయమని శనివారం రాత్రి వివిధ సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచిన అన్ని సంస్థలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి రాబోతోందని తెలిపాయి. ఎన్డీయే కూటమికి 350కి పైగా సీట్లు వస్తాయని వెల్లడిరచాయి. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ఇండియా కూటమికి 130 నుండి 160 సీట్లులోపు మాత్రమే వస్తాయని తెలిపాయి. ఇక ఇతరులు 30 నుండి 50 సీట్లలో గెలవనున్నారు. శనివారంతో దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. గత ఎన్నికలలతో పోల్చుకుంటే కొంత పోలింగ్ శాతం తగ్గినప్పటికీ ఫలితాల్లో ఎటువంటి మార్పు ఉండదని అర్ధమైపోయింది. మూడోసారి కూడా మోదీ తన పట్టును నిలుపుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాగా ఎన్డీయే కూటమికి 347 సీట్లు ఉన్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 360 నుండి 375 వరకు ఎన్డీయే కూటమికి సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడిరచాయి. సింగిల్‌గా బీజేపీకి కూడా ఈసారి 303 సీట్లు కన్నా అదనంగా వచ్చే అవకాశముంది.
నెహ్రూ, వాజ్‌పేయి రికార్డును సమం చేయనున్న ప్రధాని మోదీ
మూడు సార్లు వరుసగా గెలిచి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తుల్లో ప్రధమ ప్రధాని నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయి తర్వాత ఆ రికార్డును సమం చేసిన వ్యక్తిగా ప్రధాని మోదీ చరిత్ర పుటలకు ఎక్కనున్నారు. అయితే నెహ్రూ వరుసగా 1952, 1957, 1962 ఎన్నికల్లో నెగ్గినప్పటికీ మూడోసారి పూర్తి కాలం పదవిని నిర్వహించకుండానే మధ్యలోనే 1964లో చనిపోయారు. మరోవైపు అటల్ బిహారీ వాజ్‌పేయి వరుసగా 1996, 1998, 1999 ఎన్నికల్లో గెలిచినప్పటికీ మొదటి రెండు టర్మ్‌లు చాలా తక్కువ కాలానికే పదవిని కోల్పొయారు. మూడో టర్మ్‌లో మాత్రమే ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. మరోవైపు ఇందిరా గాంధీ కూడా మూడు సార్లు ప్రధాన మంత్రి పదవికి చేపట్టినప్పటికీ ఆమె వరుస ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఆమె 1967, 1971 తర్వాత 1980 ఎన్నికల్లో గెలిచారు. 1977 లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ జనతా కూటమి చేతిలో ఓటమి పాలయ్యింది. మూడోసారి ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టబోతున్న నరేంద్ర మోదీ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటే వరుసగా మూడు సార్లు గెలిచి 15 ఏళ్లు పాటు ఏకధాటిగా ప్రధానిగా పరిపాలించిన నేతగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు.
పెరగనున్న ఎన్డీయే బలం
వివిధ వార్తా సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఈసారి ఎన్నికల తర్వాత ఎన్డీయే బలం గత ఎన్నికల కన్నా అదనంగా పెరగనుంది. గత ఎన్నికల్లో ఎన్డీయే బలం 347 కాగా ఈసారి ఎన్డీయేలోకి టీడీపీ, జెడి(ఎస్) లాంటి పెద్ద పార్టీలతోపాటు కొన్ని చిన్న, చిన్న పార్టీలు కూడా భాగాస్వాములుగా చేరడంతో పార్టీల సంఖ్య పరంగానే కాక సీట్ల రూపంలోనూ ఎన్డీయే బలం పెరగనుంది. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలిస్తే అన్ని సంస్థలు కూడా ఎన్డీయేకు గత ఎన్నికల కంటే అధికంగానే సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కనీసంగా ఎన్డీటీవీ అంచనా ప్రకారం 357 సీట్లు ఎన్డీయేకు రానుండగా అత్యధికంగా ఇండియా టుడే ` యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం 401 సీట్లు వరకు రావచ్చనని అంచనా వేశాయి. ఇక రిపబ్లిక్ టీవీ ప్రకారం ఎన్డీయేకు 364, టైమ్స్ నౌ`ఈటీజీ ప్రకారం 358, ఎబీపీ`సీ ఓటర్ సర్వే ప్రకారం 369, రిపబ్లిక్ టీవీ ప్రకారం 364 సీట్లు కనీసంగా వస్తాయని అంచనా వేశారు. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 30కిపైగా ప్రతిపక్ష పార్టీలన్నీ జట్టు కట్టి ఇండియా కూటమిగా బరిలోకి దిగాయి. ఈ కూటమిలో ఎంతో కొంత ప్రభావం చూపుతుందని భావించారు. కానీ ప్రధాని మోదీ చరిస్మా ముందు ఇండియా కూటమి నిలువలేకపోయిందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
ఫలించిన మోదీ పాచిక…దక్షిణాదిలో ఎన్డీయేకు పెరగనున్న సీట్లు
ఇప్పటికే ఉత్తరాదిలో గట్టి పునాది వేసుకున్న బీజేపీ దక్షిణాదిలోనూ పట్టు తెచ్చుకోవాలని ఈసారి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఈ ప్రాంతంపై దృష్టి పెట్టారు. దక్షిణాదిలో ఉన్న మొత్తం 130 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 32 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఎఐడిఎంకే ఒక సీటుతో కలిపి ఎన్డీయే బలం 33 సీట్లుగా ఉన్నాయి. బీజేపీకి దక్షిణాదిలో కేవలం రెండు రాష్ట్రాల్లో కర్నాటకలో 28, తెలంగాణలో నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ మోదీ ప్రభావంతో ఈసారి దక్షిణాదిలో బిజేపీకి సీట్లు పెరగనున్నాయి. ఇటు ఎన్డీయేలోకి టీడీపీ, జెడిఎస్ చేరడంతో కూటమి బలం కూడా భారీగా పెరగనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచాయి. ఈసారి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ బోణీ కొడుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిరచాయి. అలాగే కర్నాటకలో గత ఎన్నికల్లో వచ్చిన సీట్లును నిలుపుకోవడం తోపాటు తెలంగాణాలో సీట్ల సంఖ్య రెట్టింపు అవుతుందని తెలిపాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి టీడీపీ బలంతో స్వీప్ చేస్తుందని వెల్లడిరచాయి. టీడీపీకి 13 నుండి 15 సీట్లు, బీజేపికి నాలుగు నుండి ఆరు సీట్లు, జనసేనకు రెండు సీట్లు లభిస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో చాలా సంస్థలు వెల్లడిరచాయి. మొత్తంగా ఈసారి ఎన్డీయేకు దక్షిణాదిలో 55 నుండి 65 సీట్లు లభిస్తాయని తెలిపాయి.
కాంగ్రెస్‌కు కేరళనే దిక్కు
తాము మూడెంకెల స్థానాలను దాటుతామని కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే పెద్ద పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాంగ్రెస్‌కు అత్యదికంగా 17 సీట్లు వరకు రావచ్చొని అంచనా వేశారు. ఇక పంజాబ్‌లోనూ కొంతమేరకు సీట్లు వచ్చే అవకాశముంది. ఇండియా కూటమిగా తమిళనాడులో 36 నుండి 39 సీట్లు సాధించే అవకాశముండగా ఇక్కడ కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా ఒకటి రెండు తగ్గవచ్చు. మహారాష్ట్రలోనూ నాలుగు నుండి ఆరు సీట్లు వరకు కాంగ్రెస్ గెలుచుకోగలదని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ పెద్దగా కోలుకోలేదని తెలిపాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌ఘర్, బీహార్ రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి స్వీప్ చేయనుంది. పశ్చిమ బెంగాల్లోనూ బీజేపీ 23 నుండి 26 సీట్లు వరకు గెలుచుకుంటుందని పలు సంస్థలు వెల్లడిరచాయి.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
సంస్థ ఎన్డీయే ఇండియా ఇతరులు
ఎన్‌డిటివి 357 148 38
రిపబ్లిక్ టివి`మార్టిజ్ 368 139 64
టైమ్స్ నౌ`ఈటీజీ 358 132 53
ఏబీపీ`సీ ఓటర్ 369 163 11
ఇండియాటుడే 401 131 11