- జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు
- టీడీపీ 144 అసెంబ్లీ, 17ఎంపీ సీట్లలో పోటీ
- మూడుపార్టీల నేతల సమష్టి నిర్ణయం
- చంద్రబాబు నివాసంలో చర్చల్లో పాల్గొన్న కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ జాతీయనేత పాండా, పవన్
- పోలీస్, రెవిన్యూ, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగంపైనా చర్చ
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన – భాజపా మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. మూడు పార్టీల మధ్య పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్లు, అభ్యర్థుల ఎంపికపై మూడు పార్టీల అగ్రనేతలు సమావేశమై చర్చించి సీట్ల లెక్కలను ఖరారు చేశారు. ఈ సమావేశంలో నిర్ణయించిన మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన పార్టీలు 31 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేస్తాయి.
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల కీలక భేటీ జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి దాదాపు 8 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై విస్తృతంగా చర్చలు జరిపారు. చంద్రబాబు, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, భాజపా జాతీయ నేత బైజయంత్ పాండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఈ సమావేశంలో సీట్ల లెక్కలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు. కాగా అనంతపురంలో మలివిడత శంఖారావం సభలు ముగించుకుని వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై స్పష్టత కోసం ఈ సమావేశంలో చర్చించారు. అదే విధంగా ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా ఏ విధంగా లబ్టిపొందే ప్రయత్నం చేస్తుందనే అంశంపైనా నేతలు కీలకంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని జగన్‌రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకుంటున్న తీరుపైనా, సచివాలయ వ్యవస్థ దుర్వినియోగం అంశంపైనా లోతుగా చర్చలు జరిపారు.
చర్చల అనంతరం తనకు కేటాయించిన సీట్లలో స్వల్ప మార్పులకు జనసేనాని పవన్ అంగీకరించారు. తొలుత 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనుకున్న జనసేన మూడు అసెంబ్లీ స్థానాలను, ఒక లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించింది. జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తాయి. ఇప్పటికే జనసేన 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మంగళవారం ప్రకటిస్తుందనుకుంటున్న లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో ఏపీలో అభ్యర్థుల పేర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకు సీట్ల సర్దుబాటు – చంద్రబాబు
ఏపీ ప్రజల ఆకాంక్షల మేరకు సీట్ల సర్దుబాటు జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు ఈ పొత్తులే పునాదులు. టీడీపీ 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ సీట్లు, బీజేపీ 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లు, జనసేన 2 లోక్‌సభ, 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. నియోజకవర్గాలు, అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు ప్రకటి స్తాయి. మూడు పార్టీల కూటమి ఏపీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా వ్యవహరిస్తుందన్నారు. ఏపీ ప్రజలు ఎన్డీఏ పక్షాలకు అవకాశం కల్పించి ప్రజలకు సేవ చేసే అవకాశామివ్వా లని చంద్రబాబు ఎక్స్ వేదికగా కోరారు.