అమరావతి:రాష్ట్రంలో గ్రామీణప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన 104 వ్యవస్థ ఏ 2గా పేరొందిన ఓ నేత అవినీతి కారణంగా అస్తవ్యస్తంగా తయారైందని తెలుగుదేశం శాసనమం డలి సభ్యులు దీపక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనమండలిలో 104 ద్వారా వైద్య సేవల అంశం చర్చకు వచ్చినప్పుడు దీపక్‌రెడ్డి మాట్లాడుతూ 74 రకాల మందులను రోగులకు ఉచితంగా ఇస్తున్నామని వైద్యశాఖ చెబుతున్న మాటలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రతి మండల కేంద్రంలోని గ్రామానికి నెలకు రెండుసార్లు 104 వాహనం వెళ్లాలి. కానీ సక్రమంగా గ్రామాలకు అంబులెన్స్‌లు వెళ్లట్లేదు. 104 ద్వారా చేయాల్సిన 9రకాల పరీక్షలు జరగట్లేదు. వాహనంలో 20 రకాల వైద్యసేవలని పైకి చెబుతున్నా ఆ స్థాయిలో పరికరాలేవీ కొత్త వాహనాల్లో అందు బాటులో లేవు.బీపీ మీటర్ కూడా లేదు. రోగ నిర్ధారణ పరీక్షణ యంత్రాలను కూడా తగ్గించేశారు. ఖరీదైన థైరాయిడ్ టెస్టును జాబితా నుంచి తొలగించేశారు. గతంలో 104 వాహనంలో ఒక డాక్టర్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, డ్రైవర్, వాచ్ మన్…ఇలా ఆరుగురు విధులు నిర్వహించగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక సిబ్బందిని కుదించేశారు. ప్రస్తుతం 104 వాహనంలో డాక్టర్, డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే ఉంటున్నారు. ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందోకి ఏరికోరి 104 బాధ్యతలు అప్పగించారు. ఒక్కో వాహనంపై నెలకు రూ. లక్షన్నర ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. అదే నిజమైతే వాహనాల్లో బీపీ మిషన్ కూడా ఎందుకు లేదు?కనీసం జ్వరం, జలుబు బిళ్లలు కూడా సకాలం లో ఎందుకు అందివ్వలేకపోతున్నారని దీపక్‌రెడ్డి మంత్రి విడదల రజనీని నిలదీసారు.