చంద్రబాబు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తా
` మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వెల్లడి
` సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
అమరావతి: రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయాలు, విలేజ్ వాలంటీర్ల శాఖల మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఆ సీట్లను రద్దు చేశారని ఆరోపించారు.
అవి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని, సింగరాయకోండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారని, వాటిని తిరిగి పునరుద్ధస్తూ తొలిసంతకం చేశానని మంత్రి చెప్పారు. పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును హట్ వాటర్ కోసం మంజూరు చేశామని, అక్కడే పాఠశాలలకు అందించే పళ్ళు, కూరగాయలు, గుడ్లు నిల్వకు కోల్డ్ స్టోరేజి రూమును రూ. 9 లక్షలతో పైలెట్ ప్రాజెక్టు కింద ఇస్తున్నామన్నారు.
గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్పేర్ డిపార్టుమెంట్ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ. 2505.56 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు రూ. 131.82 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని మంత్రి తెలిపారు. వాటిని ఇప్పడు తాము చెల్లించాల్సి వస్తోందని.. లేకపోతే విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్ధితి ఉందన్నారు. ఎన్టీఆర్ విద్యా ఉన్నతి పధకంకు రూ. 199 కోట్లు బకాయిలు, అంబేద్కర్ విదేశీ విద్య పధకం కింద 5.69 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని మంత్రి పేర్కొన్నారు. మంచి స్కూల్స్‌ను గత ప్రభుత్వం రద్దుచేసి రూ. 60.10 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ చట్టానికి సంబంధించి ఆర్థిక శాఖ నుండి రూ.21.81 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు.
అన్ని పథóకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయి రూ.3573.22 కోట్లు రూపాయలుగా ఉందని, ఇప్పడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిరదని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. గురుకుల పాఠశాలల్లో జీతభత్యాలు, కాస్మటిక్ చార్జీలు, నిర్వహణ చార్జీలు, ఆర్జిత శెలవులు, పారిశుద్ధ్య కార్మికుల బిల్లులు రూ. 243.34 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పేదలను మభ్యపెట్టినందునే ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారని, వాలంటీర్లను తీసేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. పెన్షన్లు ఒకటో తేదీన రూ. వెయ్యి పెంచి ఎరియర్స్ కలిపి మొత్తం రూ. 7 వేలు ఇస్తామని చెప్పామన్నారు. కాగా డోలా బాల వీరాజనేయ స్వామి భాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అభినందించారు.