- అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ప్రణాళికలు
- అవకాశాల కల్పనతోనే సంపద సృష్టి సాధ్యం
- స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047పై టాస్క్‌ఫోర్స్‌తో భేటీ
- లక్ష్య సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై లోతైన చర్చ
- విజన్ డాక్యుమెంట్‌పై పారిశ్రామికవేత్తలతో మేధోమథనం
అమరావతి (చైతన్య రథం): రానున్న రోజుల్లో 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు అమలు చేసి ఫలితాలు సాధిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అవకాశాల కల్పనతోనే సంపద సృష్టి సాధ్యమవుతుందని…. తద్వారా వచ్చిన సంపదను పేద వర్గాలకు పంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచవచ్చని సీఎం అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 13.5 శాతం వృద్ధి రేటు సాధించామని.. నేడు 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. దీనికి అసవరమైన ప్రణాళికలు, పాలసీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047పై సచివాలయంలో పారిశ్రామికవేత్తలతో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. విజన్ 2047 లక్ష్యాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి మేధోమథనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విజన్ 2047పై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు, కో ఛైర్మన్‌గా టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఉన్నారు. సచివాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, సీఐఐ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాధికారులు, పారిశ్రామికరంగ ప్రముఖులు హాజరయ్యారు. విజన్ 2047పై ప్రభుత్వ ఆలోచనలు, పాలసీలను చంద్రబాబు వారితో పంచుకున్నారు. వివిధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉత్తమ పాలసీలపై తన ఆలోచనలు, అనుభవాలు చెప్పారు. ‘‘ఇప్పుడు టెక్నాలజీ మరింత అడ్వాన్డ్స్‌గా ఉంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. యువతకు అవకాశాలు కల్పిస్తే తిరుగులేని ఫలితాలు వస్తాయి. ఏపీలో సహజ వనరులు, మానవ వనరులు, మౌళిక సదుపాయాలు, హైవేలు, ఎయిర్ పోర్టులున్నాయి. కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు మేం వేదికగా ఉండాలి అనుకుంటున్నాం. నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడాం….
ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం’’ అని సీఎం అన్నారు. నాడు ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలనే లక్ష్యంతో పని చేశామని…. నేడు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుడులుకు అవసరమైన భూములు, నీళ్లు, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని… వీటికితోడు బెస్ట్ పాలసీలు కూడా ప్రకటించామని సీఎం తెలిపారు. వీటి ద్వారా పారిశ్రామికరంగంలో ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి.ఎం రావు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్, టీవీఎస్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్, అపోలో ప్రతినిధి ప్రీతారెడ్డి, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, రెడ్డీ ల్యాబరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటు పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.