అమరావతి: విశాఖ పరిసరాల్లో రూ.2వేల కోట్ల విలువైన భూ కుంభకోణం సీఎం జగన్, ఆయన బంధువుల కనుసన్నల్లోనే జరిగిందని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమాహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలో సోమవారం బొండా ఉమా విలేకరులతో మాట్లాడుతూ జగన్ అండతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. భోగాపురం మండలంలో జరిగిన ఈ భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు. పెద్ద కుంభకోణం కాబట్టి సీఎస్ జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బొండా ఉమ డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సీఈఓ స్పందన సరిగా లేదు కాబట్టి.. సీఎస్ అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున జరిగిన భూ దోపిడీలో సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా.. జవహర్ రెడ్డి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు. డీ ఫామ్ పట్టాలన్నింటినీ సీజ్ చేసి కలెక్టర్ సహా, సంబంధిత అధికారులందరిపైనా విచారణ జరగాలి. ఆధారాలతో ఆరోపణలు చేస్తే.. విచారణ కోరకుండా, ఆరోపణలు చేసిన వారిని సీఎస్ బెదిరిస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నామని బొండా ఉమ తెలిపారు.