అమరావతి, చైతన్యరథం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్, నిర్బంధం నేపథ్యంలో ఈనెల 21వ తేదీన శనివారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబు అరెస్ట్, దాని పూర్వాపరాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. భవిష్యత్‌లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది. చంద్రబాబు నంద్యాలలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో ఉండగా ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లోకేష్ తిరిగి ప్రారంభించనున్నారు. ఎక్కడయితే ఆగిందో అక్కడ నుండే అంటే నంద్యాల నుండే నారా లోకేష్ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. వారానికి రెండు, మూడు రోజులు లోకేష్ ఈ అంశంపై ప్రజలతో మమేకం కావొచ్చునని తెలిసింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్, 40రోజులుగా ఆయన్ను జైల్లో ఉంచడంతో చలించిపోయి తట్టుకోలేక మృతి చెందిన పార్టీ సానుభూతిపరుల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించే అవకాశముంది. చంద్రబాబు విడుదల అయ్యేంత వరకు చేపట్టాల్సిన ఇతర కార్య క్రమాలపైన కూడా విస్తృతస్థాయి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ అగ్ర నేతలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారు