- పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- క్షతగాత్రులను పరామర్శించిన మంత్రుల బృందం
- బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన వైనం
- మృతదేహలను స్వస్థలాలకు పంపుతున్న ప్రభుత్వం
తిరుపతి (చైతన్య రథం): తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం ఉదయం మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించిన మంత్రుల బృందం, దుర్ఘటన చోటుచేసుకోవడానికి గల కారణాలను ఆరా తీశారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనిత, సమాచార మంత్రి పార్థసారథి, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్యమంత్రి సత్యకుమార్‌లు పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జెసీలు మంత్రుల బృందం వెంట ఉన్నారు. రుయా ఆసుపత్రి మార్చులోవున్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతిచోట సిసి కెమెరాలు ఉన్నాయని వాటిని పరిశీలించి సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు.
తిరుపతిలో జరిగిన సంఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతికి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: హోంమంత్రి అనిత
తిరుపతిలో తొక్కిసలాట ఘటన ప్రమాదమా..? కుట్రా..? అనే కోణంలో విచారణ చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరి వైఫల్యం ఉందనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని చెప్పారు. బాధ్యులు ఏస్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఘటనకు కారణం తొందరపాటు చర్యా? సమన్వయా లోపమా? అనేది విచారణలో వెల్లడవుతుందని చెప్పారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామన్నారు.. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ మంత్రి అనగాని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట: కలెక్టర్
టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో వారు కూడా డిశ్చార్జి అవుతారని చెప్పారు. మృతదేహాలకు సత్వరమే పోస్టుమార్టం నిర్వహించి వారి స్వస్థలాలకు పంపుతామన్నారు.