- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు
- మైనార్టీలను దగా చేసిన గత ప్రభుత్వం
- కూటమి ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి బృహత్తర ప్రణాళిక అమలు
- మంత్రి ఫరూక్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమ్ (పీఎంజేవీకే) నిధులను సద్వినియోగం పరుచుకుని మైనారిటీ సంస్థల నిర్మాణాల కోసం తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.26.13 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు నిధుల మంజూరు విషయంపై గురువారం మంత్రి ఫరూక్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎంజెవీకే పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి జన వికాస్ పథకం కింద రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం వివిధ నిర్మాణాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. మైనారిటీల విద్యాభివృద్ధి కోసం బాల, బాలికలకు జూనియర్ కళాశాలల ఏర్పాటు, సంక్షేమ హాస్టళ్లు, కమ్యూనిటీ హాల్స్, తదితర నిర్మాణాలను చేపడతామని వెల్లడిరచారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీలు దగాకు గురయ్యారని, ఏ ఒక్క సంక్షేమ పథకానికి కూడా మైనార్టీలు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసిన పీఎంజీవీకే పథకానికి కూడా రాష్ట్ర వాటా కింద గత ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.
పైగా కేంద్రం నిధులు కూడా దారి మళ్ల్లించడంతో మైనార్టీలకు చెందిన సంస్థల నిర్మాణాలు త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విప్లవాత్మకమైన రీతిలో వివిధ సంక్షేమ పథకాలను చేపడుతోంది. పీఎంజెవీకే నిధులతో చేపట్టే నిర్మాణాలతో మైనార్టీల కోసం ప్రత్యేకంగా విద్యాసంస్థలు నెలకొల్పితే వేలాది మంది మైనార్టీ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. కేంద్ర నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధమైన చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పీఎంజెవీకే పథకానికి తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 26.13 కోట్లను విడుదల చేస్తూ ఈ నెల 24వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి ఫరూక్ తెలిపారు.