ప్రజాజీవన మార్గంలో ఆ మహానాయకుడి నిర్విరామ ప్రయాణానికి నిండా 46 ఏళ్లు. ఎదురు దెబ్బలు పాఠాలుగా, గాయాలు గుణపాఠాలుగా, సమస్యలు సంక్షోభాలే సానుకూలావకాశాలుగా మార్చుకొనే అసిధారావ్రతుడు. నిరాశా నిసృహలను దరిచేరనివ్వని ఆశావాహుడు. గెలుపోటములకు స్థితప్రజ్ఞడు. నిర్విరామయోధుడు, అలుపెరుగని ధీరుడు.. నారా చంద్రబాబు నాయుడు.
విద్యార్ధి దశనుండే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకొన్న చంద్రబాబు.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలుపొంది 1978 మార్చి 15న శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే `చంద్రబాబు చట్టసభలోకి అడుగుపెట్టి నేటికి 46 ఏళ్లు. చంద్రబాబు రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి కాదు. రాజకీయాల్లోకి వారసత్వంగా వచ్చిన వాడు కాదు. స్వతంత్ర వ్యక్తిగా వచ్చి మహోన్నత శక్తిగా ఎదిగిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్ ఆదేశం మేరకు చంద్రగిరి నుండి పోటీ చేసి `ప్రజల్లో గుర్తింపు పొందిన జనతా పార్టీ అభ్యర్ధి పట్టాభిరామచౌదరిని ఓడిరచి ఎమ్మెల్యే అయ్యారు.
యువ నాయకుడిగా శాసనసభలో ప్రవేశించడమే గాకుండా, 28 ఏళ్ల వయస్సులోనే అంజయ్య కేబినెట్‌లో 1980 అక్టోబర్ 11న గ్రంథాలయాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా, 1982 ఫిబ్రవరి 24న భవనం వెంకట్రామ్ కేబినెట్‌లో చిన్న నీటి పారుదల శాఖామంత్రిగా, 1982 సెప్టెంబర్ 20న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కేబినెట్‌లో సాంకేతిక విద్యా శాఖామంత్రిగా పని చేశారు. తర్వాత 1983లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుండి పోటీ చేసి అప్పటి తెలుగుదేశం ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, సహచరుల వత్తిడి మేరకు, ప్రజలకు మరింత సేవచేసే యోచనతో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ప్రస్తుతం `ఏడు పదులు దాటిన వయస్సు. అందులో 46 ఏళ్ల ప్రజాజీవితం ఆయనది. మూడుదఫాలు మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు ప్రతిపక్షనేతగా, విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రకు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా, ఐదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడుగా వున్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా నాయకుడిగా ఆయనతో పోల్చ దగ్గ నాయకుడు లేడు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్ధమైన జీవనశైలి ఆయనది. భావితరాల శ్రేయస్సు కోసం, నిరంతర ఆలోచనలతో, విన్నూత్న ప్రణాళికలు రూపొందించడంలో ఆయనకు ఆయనే సాటి. తన దార్శనికతతో తెలుగుజాతి భవితను తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
విద్యార్ధి నాయకుడినుంచి రాష్ట్ర పరిపాలనా సారధి వరకు, దేశ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలనుకొనే వారికి చంద్రబాబు ఒక పాఠ్యపుస్తకమని చెప్పాలి. రాష్ట్రాభివృద్ధి, తెలుగు ప్రజల సంక్షేమమే చంద్రబాబు ఉచ్ఛాస, నిశ్వాసలు. కఠోర శ్రమ, అకుంటిత దీక్షకు చెరగని చిరునామా ఆయన. ప్రజల కోసం రెక్కలు ముక్కలు చేసుకొనే శ్రామికుడు. గాంధీజీ ఆశయాలను ఆలంబనగా చేసుకొని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన అరుదైన నాయకుడు చంద్రబాబు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవ చిహ్నమైతే, చంద్రబాబు తెలుగువారి ఆత్మవిశ్వాస ప్రతీకగా నిలిచారు. తెలుగు ప్రజల ఉద్ధరణ కోసం నిరంతరం కృషి చేస్తున్న మహర్షి చంద్రబాబు. తెలుగు ప్రజలను ప్రగతి పథం వైపు నడిపించాలని తపన పడుతున్న నాయకుడు ఆయన.
నేటితరానికి చంద్రబాబు మార్గదర్శి. సరికొత్త లక్ష్యాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగుజాతికి అందించిన దార్శనికుడు. జాతి నిర్మాణంవైపు ప్రజల్ని జాగృతం చేసిన నేత. 46 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో అద్భుతమైన విజయాలను, మరెన్నో ఆటుపోట్లు చవిచూసినా చెక్కు చెదరని గుండె నిబ్బరం, మనోధైర్యం చంద్రబాబు సొంతం.పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలన్నదే ఆయన ఆశయం. 46 ఏళ్లుగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన ప్రజా నాయకుడు.. అన్ని రాజకీయ పక్షాల వైఖరికి భిన్నంగా పరిపాలన చేసి తన విజన్‌తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. దేశంలోనే ఇంత అనుభవం ఉండి క్రియాశీలంగా ఉన్న నాయకులు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఏడు పదులు దాటిన వయస్సులోనూ నవ యువకులు కన్నా అధికంగా పని చెయ్యడం చంద్రబాబు ప్రత్యేకత.
ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసమే విభజన అనంతరం నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచారు. చంద్రబాబు పోరాట పటిమ అసాధారణమైనది. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కొద్దిమందిలో చంద్రబాబు ఒకరు. 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా.. అనతి కాలంలోనే ఘన విజయాలను సాధించారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజలవద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని పాలించిన ముఖ్యమంత్రులలో చంద్రబాబుది ప్రత్యేకమైన స్థానం. రాజకీయమంటే అధికారం కోసం ప్రాకులాడటం కాదు, రాజకీయమంటే ప్రజలకు సేవ చేసే అవకాశం పొందటమని విశ్వసించే వ్యక్తి ఆయన.
అధికారంలోవున్నా, ప్రతిపక్షంలోవున్నా ప్రజలకు సేవచేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. సీఎం అంటే ప్రజలందరికీ చిరపరిచితంగా ఉంటారనే ధోరణి తెచ్చింది చంద్రబాబే. ఆయన 9 ఏళ్లకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా మారింది. వినూత్న ఆలోచనలతో దార్శనికత ప్రదర్శించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆధునీకరించారు. తెలుగు ప్రజలకు సంపద వృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలను విస్తారంగా కల్పించిన ఘనత చంద్రబాబుదే. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఆంధ్రలో ద్వారాలు తెరిచాడు. బిల్‌క్లింటన్, బిల్ గేట్స్, టోనీబ్లెయిర్ వంటి దిగ్గజాల నుంచి గౌరవం అందుకున్న రాజకీయ ప్రజ్ఞావంతుడు `చంద్రబాబు.
దేశ, రాష్ట్ర రాజకీయాలలో చంద్రబాబుది గొప్ప చరిత్ర. అధికారంలో వున్నా లేకున్నా, ఏదైనా అధికారిక పనుల్లో విదేశాలకు వెళ్ళినా, ఆఖరికి విమాన ప్రయాణంలో వున్నప్పుడూ ప్రజలకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెడతారు. ప్రతి పనినీ పవిత్ర యజ్ఞంగా భావిస్తారు. జాతీయ రాజకీయాలను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారు. యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు, ఆ తర్వాత ఎన్డీఏ ఏర్పాటుకు అంకురార్పణ చేసినవారిలో చంద్రబాబుదే కీలక పాత్ర. ఒకానొక దశలో ఆయన్ని ప్రధాని కావాలని పార్టీలన్నీ కోరినా తాను రాష్ట్రానికే అంకితమని స్పష్టం చేసిన మహా నాయకుడు. దేశ ప్రధానుల నియామకంలో రెండుసార్లు ముఖ్యపాత్ర వహించారు. రాష్ట్రపతులుగా కెఆర్ నారాయణయన్, అబ్దుల్ కలాంను ప్రతిపాదించటంలో ముఖ్య భూమిక పోషించారు..ఆయన ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు యావత్ భారతదేశాన్నేకాక, ప్రపంచ ఆర్థిక నిపుణులనూ ఆకర్షించాయి.
జంట నగరాలకుతోడు సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించి ఆంధ్రుల రాజధానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వల్ల ఎంతోమంది యువతీ యువకులు విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థానాల్లో నిలబడేలా చేసింది. నేడు తెలుగువారు ప్రపంచం నలుమూలలా వృత్తి, ఉద్యోగాలలో రాణించి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారంటే అది చంద్రబాబు దార్శనికత వల్లనే. మహిళలను ప్రబల శక్తిగా మలచడంలో చంద్రబాబు దేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టించారు. మహిళా సాధికారత సాధించాలని స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో బిజినెస్ స్కూలు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు, రోడ్ల విస్తరణవంటి కార్యక్రమాలతో రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించారు.
ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్యవరకు ఎనలేని ప్రోత్సాహం అందించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను శ్రేయోదాయక అభివృద్ధి దిశగా నడిపించేందుకు చంద్రబాబు తనను తాను సమర్పించుకొన్నాంనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఓటమి చెంది ప్రతిపక్ష స్థానంలోకి వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా గడిచిన అయిదేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలపై గాంధేయ మార్గంలో ఏడు పదులు దాటిన వయస్సులోనూ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును, ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే 46 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి చట్టసభలోకి అడుగుపెట్టి జాతికోసం, ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మహా నాయకుడు చంద్రబాబు. అలాంటి మహోన్నత నాయకునికి `తెలుగు ప్రజల తరపున, ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది అభిమానుల తరపున అభినందనలు,శుభాకాంక్షలు.
` నీరుకొండ ప్రసాద్