- మంజూరుకు కేంద్రం ఆమోదం
- నవంబర్ నుంచి రోడ్లపై గుంతలు పూడ్చే పనులు
మంత్రి బీసీ జనార్ధన రెడ్డి వెల్లడి
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో 384 కి.మీ మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖల మంత్రి బీసీ జనార్ధన రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పలు మార్లు సంప్రదింపులు జరపడం వల్లే ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్రానికి నిధులు కేటాయించారన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, సీఎం చంద్రబాబుకి మంత్రి జనార్ధనరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ భారతమాల కార్యక్రమం కింద గతంలో రాష్ట్రానికి మంజూరు చేసిన ఈ ఏడు ప్రాజెక్టులు పలు కారణాల వల్ల ఆగిపోయాయన్నారు.
అయితే వీటిని మళ్లీ పునరుద్దరించి సంబంధిత నిధులు రాష్ట్రానికి మంజూరు చేయించాలనే లక్ష్యంతో బుధవారం తాను స్వయంగా ఢల్లీి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయంతో చేసిన సంప్రదింపులు ఫలప్రదం అయ్యాయన్నారు. ఫలితంగా స్టాండిరగ్ ఫైనాన్స్ కమిటీ ఆ ఏడు ప్రాజెక్టులను భారతమాల పథకం నుంచి తొలగించి నేషనల్ హైవేస్ అర్డ్డినరీ ప్రోగ్రామ్ (చీనూ)లో చేర్చి ఆమోదం తెలిపిందన్నారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించడం వల్ల రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు మరో ముందడుగు పడినట్లయిందన్నారు. నేషనల్ హైవేస్ అర్డ్డినరీ ప్రోగ్రామ్ క్రింద రాష్ట్రానికి మంజూరు చేసిన ఆ ఏడు ప్రాజెక్టుల వివరాలను ఆయన తెలియజేశారు.
1) కొండమోడు నుంచి పేరేచర్ల వరకు 49.9 కి.మీ
2) సంగమేశ్వరం నుంచి నల్లకాలువ, వెలుగోడు నంద్యాల జిల్లా వరకు 62.5 కి.మీ
3) నంద్యాల నుంచి కర్నూలు/ కడప బోర్డర్ సెక్షన్ వరకు 62 కి.మీ
4) వేంపల్లి నుంచి చాగలమర్రి సెక్షన్ వరకు 78.95 కి.మీ
5) గోరంట్ల నుంచి హిందుపూర్ సెక్షన్ వరకు 33.58 కి.మీ
6) ముద్దనూరు నుంచి బి. కొత్తపల్లి సెక్షన్ వరకు 56.5 కి.మీ
7) పెందుర్తి నుంచి బొడ్డవర సెక్షన్ వరకు 40.55 కి.మీ
అదే విధంగా ప్రతి ఏడాది సిఆర్‌ఐఎఫ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.350 కోట్లు మంజూరు చేస్తుందని, ఆ నిధులను రూ.500 కోట్లకు పెంచాలంటూ తాము చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రానికి రూ.500 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన 31 రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి, త్వరలోనే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మంత్రి జనార్ధనరెడ్డి తెలిపారు.
రహదారులపై గుంతలన్నీ పూడుస్తాం
గత ప్రభుత్వం రహదారుల నిర్వహణపై అశ్రద్ధ చూపడం వల్ల రాష్ట్రంలో పలు రహదారులు అధ్వాన్నంగా మారాయని, వాటిని ఇప్పడు పునరుద్ధరించాలంటే రెండు రెట్లు మేర అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. రహదారులపై గుంతలను పూడ్చేందుకు ప్రస్తుతం తమ ప్రభుత్వం రూ.290 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో నవంబరు నుండి రహదారుల గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టి గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామన్నారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో సంభవించిన వరదల వల్ల చాలా రహదారులు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణకు రూ.186 కోట్ల మంజూరు చేస్తూ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
పీపీపీ విధానం అధ్యయనానికి గుజరాత్
గుజరాత్, అస్సామ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో రహదారుల నిర్వహణకు పీపీపీ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఆ విధానాన్ని అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా అమలు పర్చాలనే లక్ష్యంతో ఈ నెల 23, 24 తేదీల్లో తనతో పాటు అధికారుల బృందం గుజరాత్ వెళుతున్నట్లు మంత్రి తెలిపారు. అధ్యయనం తరువాత బృందం నివేదికను రూపొందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పిస్తుందని మంత్రి జనార్ధనరెడ్డి తెలిపారు.