మంత్రులు, సిఎం అక్రమాలపై విచారణ జరిపించాలి
మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్
అమరావతి: అవినీతియాప్ లతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి, ముందుగా ఈ మూడేళ్లలో తనప్రభుత్వంలో జరిగిన అవినీతిపై నిగ్గుతేల్చాలని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుంచి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని కట్టడిచేయలేని జగన్మోహన్ రెడ్డి అవినీతిపేరుతో అధికారుల్ని బలిపశువుల్ని చేాయాలని చూడటం సిగ్గుచేటన్నారు. అధికారపార్టీ అవినీతిని కప్పిపుచ్చడానికే ముఖ్యమంత్రి కంటితుడుపు చర్యగా యాప్ తీసుకొచ్చారని దుయ్యబట్టారు. మద్యం, ఇసుక, గనుల తవ్వకాల్లో జరిగిన అవినీతిని మించింది దేశంలో ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబమే మద్యం, ఇసుక, సిలికాన్, గనుల్ని దోపిడీచేస్తుంటే కిందిస్థాయి అధికారుల అవినీతిని ఎత్తిచూపుతారా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేయడానికి యాప్ లు తీసుకొచ్చి బటన్లు నొక్కి మరీ ఫిర్యాదుచేయమంటున్న ముఖ్యమంత్రి ముందు ఈమూడేళ్లపాలనలో తన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని నిగ్గుతేల్చాలని, దానికోసం ఆయన తక్షణమే రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే…!.
లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, అడిగేవారిపై ఫిర్యాదుకు బటన్ నొక్కాలంటూ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలిచ్చింది. 14400 నంబర్ కి కాల్ చేయండి అంటూ ఇచ్చిన ప్రకటనచూస్తే బ్రహ్మనందం కామెడీగుర్తుకొస్తుంది. జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. కలెక్టర్లు, తహసీల్దార్లు, ఇతర చిరుద్యోగుల అవినీతి సంగతి దేవుడెరుగు, వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? అధికారపార్టీ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కంటితుడుపు చర్యగా యాప్ తీసుకొచ్చారు. అధికారుల అవినీతిపై ఫిర్యాదుకు యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వం… మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఒక కమిషన్ వేయాలి. జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అవినీతి సంగతి కోర్టుల్లో నడుస్తోంది. దానిగురించి తాము ప్రశ్నించడంలేదు. ఈ మూడేళ్లలో ఆయన ప్రభుత్వంలోని వారు చేసిన అవినీతి గుట్టుమట్లు ముఖ్యమంత్రి బయటపెట్టగలడా?
తన అక్రమాలపై విచారణ జరిపించుకోండి!
మద్యం, ఇసుక, మైనింగ్ అక్రమాలు, అవినీతికి సంబంధించి ముఖ్యమంత్రిపై వచ్చిన ఆరోపణలపై ఆయనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకొని తనచిత్తశుద్ధిని నిరూపించు కోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇసుకరీచ్ లు ప్రైవేట్ వ్యక్తికి అప్పగించిన ప్రభుత్వం, నిత్యంవేలకోట్లు దోచేస్తోంది. నెల్లూరులో జరిగే సిలికా మైనింగ్ వ్యవహారం సంగతేమిటి? సిలికాతో తానుసంపాదించేదేమీ లేదు. ఎలహంక ప్యాలెస్ కు నెలానెలా మామూళ్లు పంపిస్తున్నానని సన్నిహితులవద్ద శేఖర్ రెడ్డి వాపోయింది నిజం కాదా? ప్రకాశంజిల్లాలో ఎన్ని మైనింగ్ లు మూతపడ్డాయో తెలియదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోని గనులశాఖలోజరిగే కుంభకోణాలు ముఖ్యమంత్రికి తెలియదా? ముఖ్యమంత్రి కుటుంబమే మద్యం, ఇసుక, సిలికాన్, గనుల్ని దోపిడీచేస్తుంటే, కిందిస్థాయి అధికారుల అవినీతిని ఎత్తిచూపుతారా? సీబీఐ ముఖ్యమంత్రిపైనే రూ.43వేలకోట్ల అవినీతి జరిగిందంటూ కోర్టులో కేసువేసింది. ప్రజలు వారి హక్కులు, స్వేచ్ఛకోసం ఇప్పటికే ప్రభుత్వంపై తిరగబడుతున్నట్లు మహానాడు విజయవంతంతో రుజువైంది. ముమ్మాటికీ సాధారణ ఉధ్యోగులపై కక్షసాధించడానికే ప్రభుత్వం అవినీతి యాప్ తీసుకొచ్చింది. జగన్ అవినీతి యాప్ తీసుకురావడంపై సొంతపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే నవ్వుకుంటున్నారు. తాము, తమనాయకుడే అవినీతిలో పుట్టి దానిలో మునిగితేలుతుంటే యాప్ లు, కాల్ సెంటర్లు, టోల్ ఫ్రీ నంబర్లు ఏంచేస్తాయని చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.