.టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
మంగళగిరి: కుప్పంలో చంద్రబాబునాయుడు పోటీచేయడం ఎంత నిజమో..మంగళగిరిలో తాను ఎమ్మెల్యేగా పోటీకి దిగడం కూడా అంతే నిజమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను మంగళగిరి నుంచి పోటీ చేయటం లేదంటూ వస్తున్న వార్తల్ని నారా లోకేష్ ఖండిచారు. బుధవారం టిడిపి మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్‌ఎస్ భవన్ లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సర్వేలో తనకు మంగళగిరిలో ప్రజాధరణ లేదని ప్రజలకు తాను న్యాయం చేయలేకపోయానని తేలితే అప్పుడు చంద్రబాబు మిగిలిన 174 స్థానాల్లో ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నారు.
ఆ నిధులు ఏమయ్యాయ్?
మంగళగిరి నియోజకవర్గంలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నాననే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,600 కోట్లు కేటాయించారని అందులో రూపాయి కూడా మంగళగిరి అభివృద్ధికి ఖర్చు చేయలేదని లోకేష్ అన్నారు. ఆ నిధుల్ని ఖర్చు చేసి ఉంటే మంగళగిరిలో సమస్యలు ఉండేవి కాదని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన రాజన్న రైతు బజార్ రాజన్న క్యాంటీన్ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. తనకు కులమత బేధం లేదని అభివృద్ధి సంక్షేమమే లక్ష్యం అని పేర్కొన్నారు. గంజి చిరంజీవి కన్నా సీనియర్లు ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి ప్రాధాన్యత కలిగిన పదవిని ఇచ్చామని అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ మంగళగిరి ప్రజలకు తన సొంత ఖర్చులతో అనేక సేవలందించానని స్పష్టం చేశారు.